Begin typing your search above and press return to search.

ఈ చేరికలతో చంద్రబాబుకు మద్దెల దరువే!

By:  Tupaki Desk   |   4 Nov 2017 10:17 AM GMT
ఈ చేరికలతో చంద్రబాబుకు మద్దెల దరువే!
X
రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారుతూనే ఉంటారు. కొన్ని చేరికలు అధినేతకు మోదం కలిగిస్తాయి. మరికొన్ని చేరికలు ఖేదం కలిగిస్తాయి. అవును మరి.. వర్తమాన రాజకీయాల్లో ఏపీ పరిధిలో జరగుతున్న పార్టీ ఫిరాయింపులు - చేరికలను పరిశీలించినట్లయితే చంద్రబాబుకు మద్దెలదరువులాగా మారుతోంది. కొన్ని చేరికలు ఆయనకు ఒక కంట ఆనందబాష్పాలు తెప్పిస్తోంటే - మరికొన్ని చేరికలు మరో కంట దు:ఖ బాష్పాలు తెప్పిస్తున్నాయి. కాకపోతే.. విచారం కలిగిస్తున్నవి.. ఆయన పార్టీకి సంబంధించిన చేరికలు కాదు. భారతీయజనతాపార్టీలోకి చేరుతున్న వారివి.

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను వీలైనంత వరకు ఖాళీ చేయించి తమ పార్టీలో కలిపేసుకోవడం అనేది చంద్రబాబునాయుడు ఓ ఉద్యమంలాగా చేపట్టారు. ఇవాళ కూడా వంతల రాజేశ్వరి తెదేపా తీర్థం పుచ్చుకుంది. ఇవన్నీ ఆయనకు మోదం కలిగించే చేరికలే. కాకపోతే భారతీయ జనతా పార్టీలో అంతో ఇంతో ప్రజాబలం ఉన్న నేతలు చేరుతూఉండడం ఆయనకు కంటగింపుగా ఉండవచ్చు. నాయకుల నేపథ్యం ఎలాంటిది అయినప్పటికీ.. బలమున్న నేతలు ఆ పార్టీలో పెరగడం, భవిష్యత్తులో తమకు ఇబ్బందిగానే మారుతుందని చంద్రబాబుకు ఓ క్లారిటీ ఉంది. ఇన్నాళ్లూ రకరకాల వ్యూహాల ద్వారా.. ఏపీలో భాజపా విస్తరణకు పెద్దగా కృషి జరగకుండా చంద్రబాబునాయుడే చక్రం అడ్డువేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆయన చేతుల్లో లేకుండాపోయినట్లుంది.

రెండు రోజుల కిందట చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబు భాజపాలో చేరడం చంద్రబాబుకు మింగుడుపడకపోవచ్చు. ఎందుకంటే.. సికెబాబుతో ఆయనకు చిరకాల వైరం ఉంది. వైరం రాజకీయమే అయినా ఒకపట్టాన సర్దుకునేది మాత్రం కాదు. అలాంటిది తెలుగుదేశం సిటింగ్ ఎమ్మెల్యే స్థానం ఉన్న చిత్తూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, తన ఆజన్మశత్రువు సీకే బాబును భాజపా చేర్చుకోవడం చంద్రబాబుకు ఇష్టం ఉండని పరిణామం. పైగా –నిత్యం చంద్రబాబు ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ ఉండే భాజపా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా ఈ చేరికను పర్యవేక్షించారు కూడా.

చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంటు చంద్రబాబుకు చాలా కీలకమైంది. పైగా చిత్తూరు ఎంపీ నియోజకవర్గాన్ని కూడా చాలా కాలంగా తెదేపా కుప్పం పుణ్యమాని గెలుచుకుంటూ వస్తోంది. ఇలా తన వ్యతిరేక నాయకులతో భాజపా అక్కడ సంసిద్ధం కావడం అనేదానివల్ల.. భవిష్యత్తు పరిణామాలు ఎలా మారుతాయో అనే భయాలు స్థానిక తెదేపా నాయకుల్లోనూ కలుగుతున్నాయి.