Begin typing your search above and press return to search.

సీకెబాబు - పెద్దిరెడ్డిల రాజకీయ వైరం తొలగేనా..?

By:  Tupaki Desk   |   1 March 2019 4:53 AM GMT
సీకెబాబు - పెద్దిరెడ్డిల రాజకీయ వైరం తొలగేనా..?
X
ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. జంపింగ్ జంపాంగ్ లు జోరందుకున్నారు. ప్రస్తుతం పార్టీల్లో చేరికల కార్యక్రమలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన సీకే బాబు ఇండిపెండెంట్‌ గా ఇంకెన్నాళ్లు కొనసాగాలని తెగ బాధపడుతున్నాడట. చిత్తూరు జిల్లాలో మాస్‌ ఇమేజ్‌ ఉన్న నేతల్లో సీకే బాబు ఒకరు. 1989లో చిత్తూరు నుంచి ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరి వైఎస్‌ కు సన్నిహిత నేతగా ఎదిగారు.

ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ - బీజేపీ కండువాలు వేసుకున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేని ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కావడం లేదు. దీంతో ఆయన అనుచరవర్గం ఆందోళనకు గురువుతుందట.

2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి చేరారు సీకె బాబు. అయితే ఆయనకు చిత్తూరు నియోజకవర్గం నుంచి టికెట్‌ లభించలేదు. అయితే ఆ తరువాత ఆయన వైసీపీలో యాక్టివ్‌ గా కనిపించలేదు. జిల్లాలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీకె బాబుకి మధ్య కాంగ్రెస్‌ నుంచి రాజకీయ వైరం సాగుతోంది.

దీంతో పెద్దిరెడ్డి ఎత్తులకు చెక్‌ పెట్టలేకపోయిన బాబు కొన్నాళ్లు రాజకీయంగా సైలెంట్‌ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరుదామనుకున్నా అదీ సాధ్యం కాలేదు. దీంతో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ పార్టీలోనూ ఎక్కువరోజులు ఉండకుండా బయటికి వచ్చారు.

అయితే బాబు కొత్త ప్లాన్‌ తో ఎన్నికల్లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఓ వాహనాన్ని ఏర్పాటు చేసుకొని దానిపై వైఎస్సార్‌ - ఇందిరాగాంధీ ఫొటోలతో పాటు తమిళనాడు దివంగత నేత ఎంజీఆర్‌ ఫొటోలను పెట్టుకొన్ని ప్రజల్లోకి తిరిగారు. చిత్తూరు జిల్లా ప్రజలంతా నావాళ్లే అని చెప్పుకుంటూ వచ్చారు. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని - అయితే చిత్తూరు నియోజకవర్గానికి నేనే లీడర్‌ నంటూ ప్రచారం చేశారు.

తన వాహనంపై అటు ఇందిరాగాంధీ - ఇటు వైఎస్సార్‌ ఫొటోలను పెట్టి రెండు పార్టీల ఓటు బ్యాంకును ఆకర్షించే పనిలో పడ్డాడు. చిత్తూరు నియోజకవర్గంలో తమిళ ప్రజలు బాగానే ఉన్నారు. దీంతో ఎంజీఆర్‌ ఫొటోను కూడా పెట్టి ప్రచారం చేయసాగారు. దళిత ఓట్లను ఆకర్షించడానికి అంబేద్కర్‌ - పూలే ఫొటోలను పెట్టారు. దీంతో అన్ని పార్టీలు నావే అంటూ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తూ ఇండిపెండెంట్‌ గా బరిలో దిగేందుకు ప్లాన్‌ వేస్తున్నాడు.

అయితే ఆయన అనుచరవర్గం మాత్రం వైసీపీలో చేరాలని అంటున్నారు. అయితే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డితో వైరం ఉన్నందున ఆయన పార్టీలో చేరడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో జగన్‌ కల్పించుకొని ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితే సీకే బాబు వైసీపీ నుంచి పోటీ చేయవచ్చని ఆయన ఆనుచరులు అంటున్నారు.