Begin typing your search above and press return to search.

వైసీపీ ఫైర్ బ్రాండ్ తో బాబు భారీ షాక్... ?

By:  Tupaki Desk   |   8 Oct 2021 5:46 AM GMT
వైసీపీ ఫైర్ బ్రాండ్ తో బాబు భారీ షాక్... ?
X
వైసీపీ ఎత్తులకు టీడీపీ చిత్తు అవుతూనే ఉంది. ఇది గత మూడేళ్ళుగా సాగుతున్న రాజకీయ వ్యవహారమే. తానే అపర చాణక్యుడిని అని టీడీపీ అధినేత మురిసిపోతే పోవచ్చు గాక కానీ దానికి మించి జగన్ పై ఎత్తులు వేస్తున్నారు. చిత్రమేంటి అంటే జగన్ వ్యూహాలకు టీడీపీ అధినాయకత్వం ఎప్పటికపుడు చిక్కి అతలాకుతలం అవుతోంది. తాజాగా అలాంటి పదునైన వ్యూహాన్ని వైసీపీ రాజకీయ తెర పైకి తెస్తోంది అంటున్నారు. అదేంటి అంటే అసెంబ్లీలో చంద్రబాబును పూర్తి ఇర‌కాటంలో పెట్టే పద్మవ్యూహం. అసలే ఏపీ అసెంబ్లీ అంతా వైసీపీ సభ్యులే నిండా మోహరించి ఉన్నారు. ఏ వైపు చూసినా వారే. టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అందులో కూడా నలుగురైదుగురు ఆ పార్టీకి దూరం పాటిస్తున్నారు. ఈ నేపధ్యంలో మంది బలం తగ్గి అసెంబ్లీలో టీడీపీ సౌండ్ సరిగ్గా వినిపించని పరిస్థితి ఉంది.

దానికి తోడు అన్నట్లుగా ఇపుడు అసెంబ్లీకి కొత్త స్పీకర్ గా ఫైర్ బ్రాండ్ ఆర్ కే రోజాను ఎంపిక చేసి మరీ జగన్ పంపుతున్నారు అన్న ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. అసెంబ్లీలో ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారామ్ కి ఈ దఫా మంత్రి యోగం పడుతుంది అంటున్నారు. జగన్ ఆయనను క్యాబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది. అదే సమయంలో కొత్త స్పీకర్ గా ఎవరుండాలి అన్న దాని మీద వైసీపీ చేసిన కసరత్తు ఫలితమే ఆర్కే రోజా ఎంపిక అంటున్నారు. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మంత్రి పదవి కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. అయితే ఆ జిల్లాలో ఉన్న సామాజిక పరిస్థితుల నేపధ్యంలో రోజాకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యపడదు. దాంతో ఆమెకు అత్యున్నతమైన స్పీకర్ పదవిని కట్టబెట్టి గౌరవించాలని జగన్ ఆలోచన చేస్తున్నారు అంటున్నారు.

అంటే ఒక మహిళను స్పీకర్ ని చేయడం ఇక్కడ జగన్ మార్క్ సామాజిక న్యాయంగా కూడా చెబుతున్నారు. అదే టైమ్ లో ఫైర్ బ్రాండ్ రోజాను స్పీకర్ సీట్లో కూర్చోబెడితే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా గట్టి రిటార్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది అని భావిస్తున్నారు. టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రోజా రెండు సార్లు పోటీ చేసినా గెలవలేదు, దానికి టీడీపీ నేతల వెన్నుపోట్లే అని ఆమె నాడే బహిరంగంగా చెప్పేశారు. ఇక రోజా వర్సెస్ చంద్రబాబు అంటే ఎపుడూ హాట్ హాట్ కామెంట్స్ పడుతూనే ఉంటాయి. అలాంటి రోజాను తెచ్చి స్పీకర్ ని చేస్తే అసెంబ్లీలో చంద్రబాబు అధ్యక్షా అంటూ మాట్లాడాల్సి ఉంటుంది. ఒక విధంగా బాబుకు ఇది బాగా ఇరకాటమే అని చెప్పాలి. అలాగే అసెంబ్లీలో బాబు సహా టీడీపీని కట్టడి చేయడానికి రోజాను ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచన కూడా వైసీపీ పెద్దలకు ఉంది అంటున్నారు. మొత్తానికి తొందరలోనే మంత్రి వర్గ విస్తరణ జరిగితే అంతే త్వరగా రోజా ఈ అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలోకి వస్తారని అంటున్నారు. మొత్తానికి టీడీపీకి ట్రబుల్స్ అంటే
ఏంటో చూపించడానికే రోజాను స్పీకర్ ని చేస్తున్నారు అన్న రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.