Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్‌ పై క్లారిటీ వచ్చేసింది

By:  Tupaki Desk   |   21 Jun 2019 12:38 PM GMT
టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్‌ పై క్లారిటీ వచ్చేసింది
X
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలబోతుంది.. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సహా మరో 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు.. ప్రస్తుతం వీళ్లంతా శ్రీలంకలో ఉన్నారు.. వీళ్లంతా అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లి భారతీయ జనతా పార్టీలో చేరుతారు.. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోవడంతో పాటు శాసనసభాపక్షం బీజేపీలో విలీనం అయిపోతుంది.. ఇవీ రెండు రోజులుగా ప్రసారం అవుతున్న వార్తలు. దీంతో తెలుగుదేశం పార్టీలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్తలు చర్చనీయాంశం అవుతున్నాయి.

ఈ వార్తలు తెలుగుదేశం పార్టీని కుదిపేస్తున్నాయి. దీనికితోడు గురువారం ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఎమ్మెల్యేల జంపింగులు కూడా నిజమేనన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, గంటా శ్రీనివాస్ కూడా కనపడకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇప్పటికే తెలంగాణలో ఉనికిని కోల్పోయిన ఆ పార్టీ.. ఏపీలోనూ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చిందని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గంటా శ్రీనివాస్ స్పందించారు.

ప్రస్తుతం కొలంబోలో ఉన్న ఆయన ఓ చానెల్‌తో మాట్లాడారు. ‘‘నేను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నాకు పార్టీ మారే ఆలోచనే లేదు. శక్తి పీఠాన్ని దర్శించుకోడానికే నేను శ్రీలంక వచ్చాను. ఇంతలోనే నాపై దృష్ప్రచారం చేస్తున్నారు. నేనంటే గిట్టని వాళ్లే ఈ పని చేస్తున్నారని అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి పరిస్థితులు కొత్త కాదు. ఎంత మంది పార్టీని వీడినా తట్టుకుని నిలబడతాం. ఎన్నికల నాటికి మరింత బలపడతాం. నేను ఎప్పటికీ టీడీపీలోనే కొనసాగుతాను’’ అంటూ ఆయన తనపై వస్తున్న వార్తలను ఖండించారు.

గంటా ఈ విధంగా క్లారిటీ ఇవ్వగా ఆంధ్రప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం మరో రకంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, త్వరలోనే ఆ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తమ పార్టీలోకి వస్తారని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. మోదీ చేసిన అభివృద్ధిని చూసే టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారన్నారు. వీళ్లతో పాటు మరికొందరు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. వారంతా కొద్దిరోజుల్లో బీజేపీలో చేరుతారని చెప్పి బాంబు పేల్చడం విశేషం.