Begin typing your search above and press return to search.

తలదూర్చకు.. మంత్రి - ఎమ్మెల్యే వాగ్వాదం

By:  Tupaki Desk   |   11 Oct 2019 11:11 AM GMT
తలదూర్చకు.. మంత్రి - ఎమ్మెల్యే వాగ్వాదం
X
ఏపీ సీఎం జగన్ అనంతపురం పర్యటనలో మంత్రి శంకరనారాయణ - తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. జగన్ రాక సందర్భంగా అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి శంకరనారాయణతోపాటు ఎంపీ మాధవ్ - ఎమ్మెల్యేలందరూ స్వాగతించడానికి వేచి ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే జగన్ రాగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది.

సీఎం జగన్ అనంతపురం పర్యటనకు రాగానే ఆయనకు స్వాగతం పలుకడానికి పెద్ద ఎత్తున నేతలు తరలివచ్చారు. సీనియర్ మంత్రులు - పార్టీ నేతలు హెలీప్యాడ్ వద్దకు వెళ్లి సీఎం జగన్ కు స్వాగతం పలికారు.

అయితే ప్రొటోకాల్ ప్రకారం రూపొందించిన జాబితాలో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తోపాటు ఆయన నియోజకవర్గానికి చెందిన అసమ్మతి నేతలకు పాస్ లు ఇవ్వడం చిచ్చు రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి పాసులు ఇచ్చిన మంత్రి శంకరనారాయణతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేనైనా తనకు జగన్ ను కలవడానికి ఒకే పాస్ ఇచ్చి.. తన నియోజకవర్గానికి చెందిన పైలా నరసింహయ్య - ఇతరులకు తనకు తెలియకుండా ఎలా పాసులు ఇచ్చారని మంత్రిని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో తలదూర్చవద్దంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

మంత్రి - ఎమ్మెల్యేలు వాగ్వాదం పెద్దది కావడంతో అక్కడే ఉన్న అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వారికి సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లారు. ఆయన అడ్డుకొని ఉండకపోతే జగన్ ముందే పెద్దారెడ్డి - మంత్రి ఘర్షణ పడే పరిస్థితి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.