Begin typing your search above and press return to search.

క్రీడాకారుడి చెంప ఛెళ్లుమనిపించిన రిఫరీ.. తిరిగి కొట్టిన ఆటగాడు

By:  Tupaki Desk   |   18 May 2022 5:11 AM GMT
క్రీడాకారుడి చెంప ఛెళ్లుమనిపించిన రిఫరీ.. తిరిగి కొట్టిన ఆటగాడు
X
క్రీడాలోకంలో జరిగే అనూహ్య పరిణామాలు చాలా సిత్రంగా ఉంటాయి. తప్పు ఒకరిదైతే.. శిక్ష మరొకరిదన్నట్లుగా ఉంటుంది. న్యాయం ఎప్పుడైనా బాధితుడి తరఫునే ఉండాలి. క్రీడల్లో మాత్రం అందుకు భిన్నంగా ఒక వైపునకు మొగ్గినట్లుగా కనిపిస్తుంది. ఒక ఆటగాడి ఆటను నిర్ణయించే జడ్జి స్థానంలో ఉన్న అంపైర్ కానీ రిఫరీ కానీ తప్పు చేస్తే బలి అయ్యేది ఆటగాడు. కానీ.. తప్పుడు నిర్ణయం తీసుకున్న రెఫరీ మీద తీసుకునే చర్యలు మాత్రం చాలావరకు ఉండదు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి ఎందుకు పడాలి? అన్న ప్రశ్నకు సమాధానం లభించదు.

పాత రోజుల్లో అయితే సరైన సాంకేతికత లేని వేళ.. రిఫరీలు చేసే తప్పులను కొంతమేర పరిహరించాల్సిన అవసరం ఉండేది. కాలం మారింది. అత్యున్నత సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇలాంటివేళ.. తప్పులు జరగటానికి అవకాశమే ఉండకూడదు. ఇలాంటి సమయాల్లో తప్పులు జరిగితే దానికి శిక్ష పడితే ఇద్దరికి పడాలి. అప్పుడు మాత్రమే క్రీడాకారుడు కానీ రిఫరీ కానీ ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తారు. తాజాగా అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. రెజ్లింగ్ పోటీలో ఆటగాడి చెంపను రిఫరీ ఛెళ్లుమనిపించగా.. ప్రతిగా ఆవేశానికి గురైన క్రీడాకారుడు రెఫరీని రెండు దెబ్బలు వేసిన అరుదైన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. అయితే.. దీనికి క్రీడాకారుడికి మాత్రం జీవితకాల బ్యాన్ పడితే.. రెఫరీపై మాత్రం ఎలాంటి చర్యా తీసుకోలేదు. అసలేం జరిగిందంటే..

కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనే భారత పురుషుల రెజ్లింగ్ టీంను సెలెక్టు చేసేందుకు ట్రయల్స్ ను నిర్వహించారు. ఇందులో ఎయిర్ ఫోర్సు ఉద్యోగి సతేందర్ మాలిక్ 125 కేజీల ఫైనల్ బౌట్ లో మోహిత్ తో తలబడ్డాడు. 3-0 స్కోర్ తో ముందంజలో ఉన్నాడు. మరో 18 సెకన్లలో బౌట్ ముగిసే వేళలో మాలిక్ ను మోహిత్ మ్యాట్ పై (టేక్ డౌన్ ) పడగొట్టాడు. ఒక పట్టుపట్టి పక్కకు నెట్టేశాడు.

బౌట్ లో ఉన్న రిఫరీ వీరేందర్ టేక్ డౌన్ కు పాయింట్లు ఇవ్వలేదు. కేవలం నెట్టేసిన దానికి మాత్రమే ఒక పాయింట్ ఇచ్చాడు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ మోహిత్ ఛాలెంజ్ కు వెళ్లాడు. అతడి అప్పీల్ను సీనియర్ రిఫరీ జగ్బీర్ సింగ్ టీవీ రిప్లే ద్వారా పరిశీలించి టేక్ డౌన్ ను పరిగణలోకి తీసుకొని 2 పాయింట్లు కేటాయించాడు. దీంతో మాలిక్.. మోహిత్ ఇద్దరు 3-3 సమంగా నిలిచారు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం స్కోరు టై అయినప్పుడు ఆఖరి పాయింట్ ఎవరు చేస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు. మొహిత్ ను విజేతగా ప్రకటించారు. దీంతో ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని మాలిక్ రిఫరీ జగ్బీర్ నుంచి వివరణ కోరే ప్రయత్నం చేశారు.

దీనికి సమాధానం ఇవ్వాల్సిన జగ్బీర్ ఆయన్ను చెంపదెబ్బ కొట్టారు. ఈ ఉదంతం షాకింగ్ కు గురి చేసింది. దీంతో సహనం కోల్పోయిన మాలిక్.. రిఫరీ జగ్బీర్ ను రెండు చెంప దెబ్బలు వేశారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. ట్రయల్స్ కే మచ్చ తెచ్చేలా మారిన ఈ ఉదంతాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య కఠినంగా స్పందించింది.

రెఫరీపై ఎలాంటి చర్య తీసుకోలేదు కానీ.. క్రీడాస్ఫూర్తి.. క్రమశిక్షణ లేని మాలిక్ పై మాత్రం జీవితకాల నిషేధాన్ని విధిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ ఉదంతానికి సంబంధించి వీడియోను పరిశీలించినప్పుడు రెఫరీనే ముందుగా ఆటగాడి మీద చేయి చేసినట్లుగా స్పష్టంగా కనిపించింది. ఆటగాడిపై చర్య తీసుకోవద్దని చెప్పట్లేదు.. అదే సమయంలో భావోద్వేగ రహితంగా ఉండాల్సిన రిఫరీ అలా చేయి చేసుకోవటం సబబేనా? అన్నది ప్రశ్న. దానికి ఆయన మూల్యం చెల్లించాలి కదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. భారత రెజ్లింగ్ సమాఖ్య సైతం విషయాన్ని ఒక వైపు మాత్రమే చూస్తే సరిపోదు కదా? రెండు వైపులా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోవటం ఏమిటన్న ప్రశ్న పలువురిలో తలెత్తుతోంది.