Begin typing your search above and press return to search.

జనసేనలో ఘర్షణ.. అంత క్రేజ్ వచ్చిందా?

By:  Tupaki Desk   |   29 Dec 2022 10:30 AM GMT
జనసేనలో ఘర్షణ.. అంత క్రేజ్ వచ్చిందా?
X
ఇరువర్గాల మధ్య ఘర్షణలు.. సీటు కోసం ఆందోళనలు.. గ్రూపు విభేదాలు.. ఒక రాజకీయ పార్టీలో ఇవి జరుగుతున్నాయంటే అ పార్టీకి డిమాండ్ ఉందనే చెప్పాలి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలో ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సీటును దక్కించుకుంటే చాలు.. ఆ ఊపులో గెలిచినట్లేనని ఫీలవుతారు. ఈ క్రమంలో సీట్ల కోసం పోటీ ఏర్పడి కొట్టుకునే స్థాయికి వెళతారు. కానీ ఏపీలోని ప్రతిపక్ష పార్టీ జనసేనలో ఓ సీటు కోసం పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణల వరకు వెళ్లాయి. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి సీటును దక్కించుకోవడానికి జనసేనలోని కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇక్కడి పార్టీలోని నాయకులు రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. సీటు విషయంలో వీరి మధ్య వివాదాలు ఏర్పడి ఆ తరువాత ఘర్షణలకు దారి తీశాయి. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఆ తరువాత ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో జనసేన రోజురోజుకు అభివృద్ధి చెందుతుందా..? నిజంగానే ఆ పార్టీకి ప్రజల్లో క్రేజ్ వచ్చిందా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

2019లో ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు ఒకే ఒక్క సీటు దక్కింది. దీంతో ఇక ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని మిగతా పార్టీల నాయకులు విమర్శించారు. కానీ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొన్నాళ్లు కనిపించకపోయినా.. ఆ తరువాత ప్రజల్లో తిరగడం మొదలు పెట్టారు. రైతుల నుంచి విశాఖ ఉక్కు కార్మికుల కోసం ఎక్కడ ఆందోళన జరిగినా.. అక్కడ వాలిపోతున్నారు. అటు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని పార్టీ నాయకులే సొంతంగా డబ్బుల వేసుకొని రోడ్డు వేసుకున్న విషయంపై వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించింది. దీంతో రోడ్ల నిర్మాణాలు చేపట్టింది.

సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనసేన రాజకీయంగానూ పట్టు సాధిస్తోంది. ఇటీవల విశాఖలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం అణిచివేయాలని చూసింది. ఒక దశలో పవన్ ను అరెస్టు చేసేందుకు భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఈ విషయంలో ఏమాత్రం జడవకుండా జనసైనికులు ఎదురొడ్డి నిలిచారు. దీంతో జనాల్లో పార్టీపై క్రేజ్ పెరిగింది. ఇదిలా పవన్ ప్రత్యక్షంగా ప్రజలను నేరుగా కలుస్తూ వారి అండగా ఉంటామని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం ఇళ్లు కూలిస్తే వారిని పరామర్శించేందుకు వెళ్లి.. లక్ష చొప్పున పరిహారం కేటాయించారు.

జనసేన చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులైన టీడీపీ లాంటి పార్టీలు అటువైపు చూస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనతో పొత్తు ఉంటుందని పరోక్షంగా చెప్పారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పవన్ కు ఫుల్ సపోర్టుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని పవన్ కూడా డిక్లేర్ చేశారు. ఈ తరుణంలో అధికారంలో ఉన్న వైసీపీ జనసేనపై ఫోకస్ చేసింది. ఆ పార్టీ అధినేత పవన్ పై తమ పార్టీ నాయకులతో విమర్శలు చేయించడం ప్రారంభించింది.

ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి అంబటి రాంబాబు పవన్ పై పదే పదే విమర్శలు చేశారు. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ ను అదే సమాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో జనసేన నాయకులు అంబటి రాంబాబుపై గురి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబును ఓడిస్తామని పట్టుబడి కూర్చున్నారు. దీంతో ఈ జిల్లాలోని సత్తెనపల్లి సీటుకు జనసేనలో డిమాండ్ ఏర్పడింది. ఎలాగైనా జనసేన తరుపున సీటును దక్కించుకొని అంబటి రాంబాబును చురకలు అంటించాలని అనుకుంటున్నారు.

దీంతో ఈ సీటును దక్కించుకోవానుకున్న క్రమంలో పార్టీలో విభేదాలు ముదిరాయి. ఆ తరువాత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే సత్తెనపల్లి సీటుకు అంత క్రేజ్ ఏర్పడడం వెనుక పార్టీ బలం ఏంటో అర్థం చేసుకోవచ్చని కొందరు అంటున్నారు. అయితే వైసీపీ ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు ఈ వివాదాన్ని పార్టీ అధినేత ఎలా చక్కబెడుతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.