Begin typing your search above and press return to search.

భారత సీరియల్‌ పై బంగ్లాదేశ్‌ లో ఘర్షణ!

By:  Tupaki Desk   |   19 Aug 2016 1:57 PM GMT
భారత సీరియల్‌ పై బంగ్లాదేశ్‌ లో ఘర్షణ!
X
ఒక ప్రాంతంలో చిన్న గొడవ మొదలైంది.. ఆ చిన్న గొడవకాస్త పెద్ద ఘర్షణకు దారితీసింది.. ఫలితంగా ఒక రెస్టారెంట్ ద్వంసమవడంతో పాటు, వందమందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ పరిస్తితుల్లో ఈ గొడవను అదుపుచేయడానికి పోలీసులు రంగంలోకి దిగి, గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ఈ విషయాలన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏదో పెద్ద విషయం మీద ఒక భారీ వివాదం జరిగిందని అనిపిస్తుంది కదా! కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం ఎలా నవ్వాలో అలా నవ్వుతారు.

విషయానికొస్తే... భారతదేశంలో సీరియల్స్ గురించి, వాటిపై ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీరియల్స్ - మహిళలు విషయంలో చెప్పలేనన్ని జోకులు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. సీరియల్ మోజులో పడి భర్తను పట్టించుకోని ఇల్లాలు, పిల్లలకు వంటచేయని మహిళలు ఇలా రకరాకాల సెటైర్స్ కూడా తెలిసినవే. ఈ క్రమంలో ఒక సీరియల్ విషయంలో జరిగిన చిన్న గొడవ పెద్ద వివాదంగా మారిపోవడం, అది కాస్త పోలీసులు బాష్పవాయు గోళాలు కూడా ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజాగా భారతదేశంలోని ఒక సీరియల్‌ గురించి బంగ్లాదేశ్‌ లోని ఓ గ్రామ ప్రజలు ఘర్షణ పడ్డారు. బెంగాలీలో బాగా పేరొందిన సీరియల్‌ ‘కిరణ్‌మాలా’ను చూడడానికి హబిగంజ్‌ జిల్లాలోని ధోల్‌ గ్రామంలోని ప్రజలు ఒక రెస్టారెంట్‌ వద్ద చేరారు. ఈ సీరియల్‌ లో యోధురాలైన యువరాణి దుష్టశక్తి నుంచి ప్రజలను కాపాడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఆప్రజల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ సీరియల్ కథ విషయంలో చిన్న తగాదా మొదలైంది. ఆ చిన్న తగాదా కాస్త చినికి చినికి గాలివానగా మారి.. పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈసంఘటనలో వందల మందికి ప్రజలు పాల్గొనడంతో పోలీసులకు సమాచారం అందింది.

పరిస్థితి ఏ స్థాయికి చేరిందంటే.. ఈ ఘర్షణలో వందమందికి పైగా గాయపడటం, ఆ సీరియల్ చూస్తున్న రెస్టారెంట్ కూడా ధ్వంసమవడం జరిగిపోయింది. పరిస్థితి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితి అదుపుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో పోలీసుల లాఠీచార్జి కూడా ఏమీ ఫలితం ఇవ్వకపోవడంతో రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాల ప్రయోగం కూడా చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్‌ సోషల్‌ మీడియాలో విపరీతమైన సెటైర్స్ పడుతున్నాయి. అంతేనా... ఏకంగా భారతీయ ఛానల్స్‌ ని నిషేధించాలని ట్వీట్లు కూడా చేస్తున్నారట.