Begin typing your search above and press return to search.

ర్యాంక‌ర్ కోసం కోట్లాడుకుంటున్న నారాయ‌ణ‌.. శ్రీ‌చైత‌న్య‌

By:  Tupaki Desk   |   27 Oct 2017 5:42 AM GMT
ర్యాంక‌ర్ కోసం కోట్లాడుకుంటున్న నారాయ‌ణ‌.. శ్రీ‌చైత‌న్య‌
X
ప్ర‌ముఖ విద్యాసంస్థ‌లైన నారాయ‌ణ‌.. శ్రీ‌చైత‌న్య‌ల మ‌ధ్య వైరం గురించి తెలుగోళ్లంద‌రికి సుప‌రిచిత‌మే. ఈ రెండు విద్యాసంస్థ‌ల పుణ్య‌మా అని తెలుగు నేల మీద విద్యా ప్ర‌మాణాలు ఏ రీతిలో మారిపోయాయో అంద‌రికి తెలిసిందే. ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌టంతో గ‌డిచిన కొన్ని సంవ‌త్స‌రాలుగా టెన్త్ త‌ర్వాత ఇంట‌ర్ అన్న వెంట‌నే ఈ రెండు విద్యాసంస్థ‌లు మాత్ర‌మే గుర్తుకు వ‌చ్చే దారుణ ప‌రిస్థితి ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ రెండు సంస్థ‌ల మ‌ధ్య పోటీ పోటీనే.. మ‌రోవైపు ఈ రెండు సంస్థ‌లు క‌లిసి చైనా(చైత‌న్య‌..నారాయ‌ణ‌) పేరిట ఒక ప్రోగ్రాం పెట్టి విద్యా వ్యాపారం చేస్తున్న‌ట్లుగా చెబుతారు. బాగా చ‌దివే విద్యార్థుల్ని త‌మ సంస్థ‌లో చేర్చుకోవ‌టానికి పెద్ద ఎత్తున పోటీప‌డే ఈ సంస్థ‌ల మ‌ధ్య తాజాగా ఒక కోట్లాట షురూ అయ్యింది. విద్యా సంవ‌త్స‌రం ఆరంభంలో ర్యాంక‌ర్ విద్యార్థిని త‌మ విద్యాసంస్థ‌లో చ‌దివేందుకు భారీ ఎత్తున ప్ర‌లోభాల‌కు గురి చేయ‌టం.. పోటీ ప‌డి మ‌రీ త‌మ వైపున‌కు తెచ్చుకోవ‌టం మామూలే. అయితే.. ఈసారి అందుకు భిన్నంగా విద్యా సంవ‌త్స‌రం మ‌ధ్య‌లో ఒక ర్యాంక‌ర్ విష‌యంలో నారాయ‌ణ‌.. శ్రీ‌చైత‌న్య మ‌ధ్య కోట్లాటకు దిగాయి. ఇదిప్పుడు కేసుల వ‌ర‌కు వెళ్లి సంచ‌ల‌నంగా మారింది.

ఆంధ్ర‌లో ఈ ఎపిసోడ్ మొద‌లైతే.. తెలంగాణ‌కు చేరిన ఈ సంచ‌ల‌న ఉదంతం వింటే.. నారాయ‌ణ‌.. శ్రీ‌చైత‌న్య‌ల మ‌ధ్య నెల‌కొన్న పోటీ ఎంత తీవ్రంగా ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది.

నెల్లూరు చాక‌లి వీధికి చెందిన రియాజ్ అహ్మ‌ద్‌.. ఆరీఫ్ దంప‌తుల కుమారుడు ఎండీ ఫాజిల్‌. ఈ పిల్లాడు నెల్లురు ధ‌న‌ల‌క్ష్మీపురంలోని నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. చ‌దువుల్లో సూప‌ర్ ఫాస్ట్ అయిన ఫాజిల్ నారాయ‌ణ హాస్ట‌ల్ లో ఉంటున్నాడు. దీపావ‌ళి సెల‌వుల కోసం ఇంటికి వ‌చ్చాడు.

చ‌దువుల్లో మేటి అయిన ఫాజిల్ టెన్త్ లో రికార్డు మార్కులు సాధించ‌టం ప‌క్కా అన్న అంచ‌నాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో శ్రీ‌చైత‌న్య విద్యాసంస్థ‌ల ప్ర‌తినిధులు ఫాజిల్ త‌ల్లిదండ్రుల్ని సంప్ర‌దించారు. త‌మ స్కూల్లో ఫాజిల్‌ను చేర్పిస్తే ఇంట‌ర్ వ‌ర‌కు ఉచితంగా చ‌దువు చెబుతామ‌ని.. ఒక్క పైసా కూడా క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదంటూ వ‌ల వేశారు. త‌మ ఆఫ‌ర్ కు ఫాజిల్ త‌ల్లిదండ్రులు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వ‌కుండా 20న ఫాజిల్‌ను త‌మ వెంట హైద‌రాబాద్‌కు తీసుకెళ్లారు. అత‌న్ని ఈ నెల 20న హైద‌రాబాద్ లోని అయ్య‌ప్ప సొసైటీలో ఉన్న శ్రీ‌చైత‌న్య రెసిడెన్షియ‌ల్ క్యాంప‌స్ లో చేర్పించారు.

దీపావ‌ళి సెల‌వులు పూర్తి అయి.. స్కూల్ తెరిచిన త‌ర్వాత ఫాజిల్ రాక‌పోవ‌టంతో నారాయ‌ణ విద్యాసంస్థ‌ల సిబ్బంది ఆరా తీశారు. విష‌యం అర్థ‌మైన నారాయ‌ణ సిబ్బంది ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఫాజిల్ త‌ల్లిదండ్రుల‌పై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టాల‌ని కోరారు. విద్యాసంస్థ‌ల మ‌ధ్య నెల‌కొన్న పోటీ తెలిసిన ఫాజిల్ త‌ల్లిదండ్రులు ఈ విష‌యంలో స్పందించ‌కుండా మౌనంగా ఉన్నారు. అయితే.. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల ప్ర‌తినిధుల నుంచి ఒత్తిడి పెర‌గ‌టంతో చివ‌ర‌కు వారు హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. అయ్య‌ప్ప సొసైటీలోని క్యాంప‌స్ కు వెళ్లి.. త‌మ కొడుకుతో ఒక‌సారి మాట్లాడాల‌ని సిబ్బందిని కోరారు.

అందుకు శ్రీ‌చైత‌న్య సిబ్బంది నో చెప్పారు. ఇప్పుడు ఫాజిల్‌ను క‌లిసేందుకు అవ‌కాశం లేద‌న్నారు. దీంతో.. ఫాజిల్ త‌ల్లి ఆరీఫా నెల్లూరు వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసింది. శ్రీ‌చైత‌న్య సిబ్బంది త‌న పిల్లాడ్ని కిడ్నాప్ చేసిన‌ట్లుగా కేసు న‌మోదు చేశారు. అయితే.. ఈ ఉదంతంపై నారాయ‌ణ విద్యాసంస్థ‌ల నుంచి ఒత్తిడి ఉండ‌టంతో కేసు వివ‌రాల్ని పోలీసులు బ‌య‌ట‌పెట్ట‌టం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కేసు విష‌యాన్ని తెలుసుకున్న శ్రీ‌చైత‌న్య విద్యాసంస్థ‌లు.. ఒక ప్ర‌ముఖ మీడియాను సంప్ర‌దించి.. త‌మ మ‌ధ్య‌నున్న పోటీ గురించి చెప్పి.. ఫాజిల్ ఉదంతాన్ని చెప్పారు. తాము కిడ్నాప్ చేయ‌లేద‌ని.. విద్యార్థి ఇష్టంలోనే స్కూల్లో చేర్పించిన‌ట్లుగా స‌ద‌రు టీవీ ఛాన‌ల్ తో మాట్లాడించారు. మొత్తంగా ఒక ర్యాంక‌ర్ కోసం రెండు పెద్ద విద్యాసంస్థ‌ల మ‌ధ్య మొద‌లైన ర‌గ‌డ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.