Begin typing your search above and press return to search.

సంస్థలు ఇలా వుంటే పిల్లలు చావరా.. ?

By:  Tupaki Desk   |   28 Oct 2017 11:30 PM GMT
సంస్థలు ఇలా వుంటే పిల్లలు చావరా.. ?
X
కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని జీవితాలను కడతేర్చుకున్నప్పుడు మాత్రమే.. ప్రభుత్వానికి కళ్లు తెరచుకుంటాయి. ఆ సంస్థలతో సమీక్షలు జరుగుతాయి. తాము పిల్లలపై ఒత్తిడి చేయడంలేదంటూ యాజమాన్యాలు చెబుతాయి. ర్యాంకుల పోకడ పోవాలంటూ మొక్కుబడి నిర్ణయాలు వస్తాయి. అక్కడితో తెరదించేస్తారు. కానీ.. నెల్లూరులో జరిగిన వ్యవహారం గమనిస్తే.. ఈ కార్పొరేట్ కాలేజీలు ర్యాంకులు మరియు ర్యాంకర్ల కక్కుర్తితో ఎంత నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నాయో అర్థమవుతుంది. ఒక్క ర్యాంకర్ కోసం ఇంత నీచంగా వ్యవహరించే సంస్థలు పిల్లలను ఒత్తిడి చేయకుండా ఉంటాయంటే నమ్మడం ఎలా? అనే అనుమానాలూ కలుగుతాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ దుర్మార్గాల్ని చూసీ... చూడనట్లుగా - తమ ఎరుకకే రానట్లుగా వ్యవహరిస్తూ చిన్నారుల ప్రాణాల విషయంలో ధృతరాష్ట్రపాలన సాగిస్తుంటుంది.

తల్లితండ్రులందరికీ వాళ్ల పిల్లలు గొప్పగా చదవాలి.. టాపర్లవ్వాలి అనే కోరిక ఉంటుంది. పిల్లాడు కాస్తంత బాగా చదివితే శ్రీచైతన్య నారాయణ లో పడేస్తారు.. ఎందుకంటే పిల్లాడు ఇంకా బాగా చదువుతాడు అంటారు.. ఒకవేళ పిల్లాడు చదవలేకపోకపోయినా శ్రీచైతన్య నారాయణ లో పడేస్తారు.. ఎందుకంటే.. అక్కడైతే బాగా చదివిస్తారు అంటారు! తల్లిదండ్రులు గానీ, ఆ కాలేజీలు గానీ మార్కులు చూసుకుంటాయే తప్ప పిల్లల ఒత్తిడిని గమనించరు... వాడు ఆత్మహత్య చేసుకునేంతవరకు.

ఈ కార్పొరేట్ కాలేజీల్లో పిల్లాడు బాగా చదివితే.. ర్యాంకులకోసం రాచి రంపాన పెడతారు.. ఒకవేళ చదవకపోయినా సంస్థ పేరు దెబ్బతింటుందని , అడ్మిషన్ రిజిస్టర్లలోంచి తీసేసి, ప్రెవేటు పరీక్ష రాసుకోమని సూచించి.. అవమానించి మరో రకంగా రాచి రంపాన పెట్టేస్తారు. వారి ర్యాంకుల కక్కుర్తి ఎలా ఉంటుందనడానికి ఇది నిదర్శనం.

నెల్లూరులో ఒక్క టాపర్ కోసం రెండు సంస్థలు యుద్ధం చేస్తున్నాయి. ఓ విద్యార్ధిని ప్రలోభపెట్టారని ఇరు విద్యాసంస్థల ప్రతినిధులు శుక్రవారం నాడు దొమ్మీకి దిగాయి. ఓ వైపు నారాయణ విద్యాసంస్థల వారు రాజకీయం చేస్తున్నారని.. మాకెలాంటి రాజకీయాలు రావని.. విద్యార్ధిని అపహరించారని వాళ్ల తల్లితండ్రులతో ఫిర్యాదు చేయించారని శ్రీచైతన్య విద్యాసంస్థ ప్రతినిధులు చెబుతోంటే, మరోవైపు నారాయణ విద్యాసంస్థలో పదో తరగతి చదివే ముగ్గురు విద్యార్ధుల తల్లితండ్రులను ప్రలోభపెట్టి ఆ విద్యార్ధులను శ్రీచైతన్య సంస్థ నిర్వాహకులు అపహరించారని.. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురు తిరుగుతున్నారని నారాయణ విద్యాసంస్థల నిర్వాహకులు పేర్కోన్నారు. ఇలా ర్యాంకుల కోసం వీధిపోరాటాలకు దిగే వాళ్లు.. సంస్థల్లో ఉండే పిల్లలను మార్కులు తయారుచేసే యంత్రాల్లా చూస్తారే తప్ప.. ప్రేమగా విద్య నేర్పగలరా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.