Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లో ముస‌లం మొద‌ల‌య్యింది

By:  Tupaki Desk   |   30 Aug 2017 1:38 PM GMT
టీఆర్ ఎస్ లో ముస‌లం మొద‌ల‌య్యింది
X
14 ఏండ్ల నుండి పార్టీలో ప‌ని చేసిన వారికి మొండిచెయ్యి. అదీ తెలుగుదేశం పార్టీ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ - కాంగ్రెస్ పార్టీల తీవ్ర ప్ర‌భావం ఉన్న ప‌రిస్థితుల‌లో తెలంగాణ జెండా నెత్తిన పెట్టుకుని తిరిగితే పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అప్ప‌టి వ‌ర‌కు టీఆర్ ఎస్ ను అడుగ‌డుగునా అణ‌గ‌దొక్కిన వారు వెంట‌నే పార్టీలో చేరి ఏకంగా ప‌ద‌వుల్లో ఎక్కి కూర్చుని ఏండ్ల త‌ర‌బ‌డి ప‌ని చేస్తున్న వారికే ప‌నులు చెప్ప‌డం మొద‌లు పెట్టారు. ఖ‌మ్మం జిల్లాలో సీనియ‌ర్ టీఆర్ ఎస్ నేత‌ల ప‌రిస్థితి గుడ్డొచ్చి పిల్ల‌ను వెక్కిరించిన‌ట్లు త‌యార‌యింది.

ఒక తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు - ఒక పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి - ఒక కొండ‌బాల కోటేశ్వ‌ర్ రావు వంటి వారు ఎప్ప‌టి నుండో పార్టీలో ఉన్న టీఆర్ ఎస్ జిల్లా అధ్య‌క్షుడు బేగ్ - మాజీ అధ్య‌క్షుడు రాజేంద‌ర్ వంటి వారి మీద ఇప్పుడొచ్చి పెత్త‌నం చెలాయిస్తున్నారు. పార్టీలోకి వ‌చ్చి ప‌ద‌వులు అనుభ‌విస్తుండ‌డమే కాకుండా టీఆర్ ఎస్ హ‌యాంలో అభివృద్ది జ‌ర‌గ‌డం లేద‌ని ప్ర‌చారం చేస్తుండ‌డం పాత‌వారికి రుచించ‌డం లేదు.

ఈ రోజు ఖ‌మ్మం జిల్లా మ‌ధిర‌లో జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మావేశంలో గొడ‌వ చెల‌రేగి కుర్చీలు విసురుకోవ‌డం, బాహాబాహీకి దిగ‌డం వ‌ర‌కు వెళ్లింది. ఇత‌ర పార్టీల నుండి వ‌చ్చిన వారు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నార‌ని, ఇష్టం లేకుంటే పార్టీ వ‌దిలి వెళ్లిపోవాలి అని టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ అన‌డంతో గొడ‌వ మొద‌ల‌యింది. కుర్చీలు విసురుకున్న నేత‌లు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కోరారు. ఆఖ‌రుకు ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి క్ష‌మాప‌ణ చెప్ప‌డంతో స‌మ‌స్య అప్ప‌టికి స‌ర్దుకుంది