Begin typing your search above and press return to search.

హోంమంత్రి ఎదుటనే కార్యకర్తల బాహాబాహీ

By:  Tupaki Desk   |   10 March 2020 9:40 AM GMT
హోంమంత్రి ఎదుటనే కార్యకర్తల బాహాబాహీ
X
స్థానిక సంస్థల ఎన్నికలంటేనే తీవ్ర ఉత్కంఠను రేపేవి. క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా చోటమోటా నాయకులు భావిస్తుంటారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు తమతో తిరిగిన వారికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విబేధాలు మొదలై ఘర్షణకు దారితీసే పరిస్థితులు వస్తాయి. తాజాగా అది అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే మొదలయ్యాయి. ఏకంగా హోంమంత్రి ఎదుటనే జరగడం గమనార్హం. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలో వర్గ విబేధాలు బయటపడుతున్నాయి.

తాజాగా హోంమంత్రి మేకతోటి సుచరిత సమక్షంలోనే కార్యకర్తలు బాహాబాహికి దిగారు. మంత్రి సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. కాకుమానులోని విష్ణు ఆలయ కల్యాణ మండపంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వైఎస్సార్సీపీ కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ సమయంలో రేటూరు ఆలయ ట్రస్టు సభ్యుల నియామకం పై చర్చ జరిగింది. ఈ విషయమై రెండు వర్గాలు తమతమ సభ్యులను ప్రతిపాదించారు. అయితే ఒకరు ప్రతిపాదించిన దాన్ని మరొక వర్గం వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని దాడి చేసేకునే పరిస్థితికి దారీ శాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సమయంలో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని వారిని వెళ్లగొట్టారు. ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఈ పరిణామంపై హోంమంత్రి సుచరిత ఖంగుతిన్నారు. కార్యకర్తలపై తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పద్దతిగా కూర్చోని మాట్లాడుకోవాలి తప్ప.. ఇలాంటి దాడులకు దిగడం, రాద్ధాంతం చేయడం సరికాదని హితవు పలికారు. అందరికీ న్యాయం జరుగుతుందని, ఎవరికి టికెట్ ఇచ్చినా అన్ని వర్గాలు పార్టీ మద్దతుదారులు గెలిపించేలా చేయాలని సూచించారు.