Begin typing your search above and press return to search.

భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు ... ప్రత్యర్థులపై రాళ్లు రువ్విన మరో వర్గం, ఇద్దరి పరిస్థితి విషమం !

By:  Tupaki Desk   |   8 March 2021 6:51 AM GMT
భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు ... ప్రత్యర్థులపై రాళ్లు రువ్విన మరో వర్గం, ఇద్దరి పరిస్థితి విషమం !
X
నిర్మల్ జిల్లాలోని భైంసాలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పట్టణంలోని ఓ కాలనీలో జరిగిన చిన్న గొడవ పెను వివాదానికి కారణమైంది. ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో పలువురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. జుల్ఫికర్ కాలనీలో రాత్రి ఏడున్నర గంటల సమయంలో కొందరు యువకులు సైలెన్సర్లు తొలగించిన బైకులపై పెద్ద శబ్దంతో కాలనీలో తిరిగారు. ఆ శబ్దాన్ని భరించలేని స్థానికులు వారిని నిలదీశారు. రైతులు, కూలీలు ఇళ్లకు వచ్చి నిద్రపోయే సమయమని, ఇంతటి శబ్దాలతో వారిని ఇబ్బంది పెట్టవద్దని యువకులకు సూచించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన చిన్నపాటి ఘర్షణ పెద్దగా మారింది. పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది.

బట్టీగల్లీ, పంజేషా చౌక్, కోర్బగల్లీ, బస్టాండ్ సహా పలు ప్రాంతాలకు ఘర్షణలు వ్యాపించాయి. ప్రత్యర్థి వర్గం జనావాసాలపైకి రాళ్ల దాడికి దిగడమే కాకుండా ఆటోలు, కారు, బైకులను తగలబెట్టారు. కత్తులతో వీధుల్లో హల్ ‌చల్ చేశారు. ఓ కూరగాయల దుకాణాన్ని తగలబెట్టారు. కవరేజీకి వెళ్లిన మీడియాపైనా కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ప్రముఖ పత్రికలకు చెందిన ముగ్గురు విలేకరులకు కూడా గాయాలయ్యాయి. దేవా, విజయ్ అనే విలేకరుల పరిస్థితి విషమంగా మారడంతో వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ పోలీసు అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రాళ్ల దాడిలో గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు పట్టణంలో అదనపు బలగాలను మోహరించారు.

పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో భైంసాలో రాత్రికి రాత్రే 600 మంది పోలీసులను మోహరించారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం భైంసాలో 144 సెక్షన్ అమలుచేశారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రార్థనా మందిరాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

భైంసా అల్లర్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఒక చిన్న యాక్సిడెంట్ ఈ దాడులకు కారణమైందని అన్నారు. ప్రమాదానికి మత కోణం రుద్దడంతో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయన్నారు.అసలు భైంసాలో ఏం జరుగుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్కడ శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా అని నిలదీశారు. భైంసా అల్లర్లపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ట్విట్టర్‌ లో స్పందించారు. అల్లర్లను ఖండిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఇద్దరు రిపోర్టర్లు,బీజేపీ కార్యకర్తలు,పోలీసులు గాయపడటం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మనం భారత్‌ లో ఉన్నామా? పాకిస్తాన్ ‌లో ఉన్నామా? అని ప్రశ్నించారు. భైంసా అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గాయపడినవారిని మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాలన్నారు