Begin typing your search above and press return to search.

జులై 31 లోపు 12వ తరగతి ఫలితాలు ఇవ్వాల్సిందే : సుప్రీం

By:  Tupaki Desk   |   24 Jun 2021 11:30 AM GMT
జులై 31 లోపు 12వ తరగతి ఫలితాలు ఇవ్వాల్సిందే : సుప్రీం
X
దేశంలో అన్ని రాష్ట్రాల్లో 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్‌ మార్కుల అసైన్ మెంట్‌ పూర్తి చేసి, జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల్లోగా బోర్డులను మూల్యాంకన విధానాన్ని రూపొందించి కోర్టుకు తెలియజేయాలని తెలిపింది. 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం ఈ రోజు విచారణ జరిపింది. అయితే, బోర్డులన్నింటికీ ఏకరూప మూల్యాంకన విధానం ఉండేలా ఆదేశాల ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది.

దేశంలోని ప్రతి రాష్ట్ర బోర్డు కూడా స్వయంప్రతిపత్తి కలిగిఉందని, అందువల్ల బోర్టులు తమ సొంత మూల్యాంకన విధానాలను రూపొందించుకునే హక్కు ఉంటుంది అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టి వచ్చే నెల 31లోగా ఫలితాలను వెల్లడించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.అంతకుముందు సీబీఎస్‌ ఈ, సీఐఎస్‌ సీఈ బోర్డులకు కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఆయా బోర్డులు కోర్టుకు తమ మూల్యాంక విధానాన్ని తెలియజేశాయి. జులై 31లోగా 12వ తరగతి ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించాయి. కరోనా మహమ్మారి ఉద్ధృతి దృష్ట్యా ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు 12వ తరగతి పరీక్షలను రద్దు చేయగా.. ఆరు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చే నెలలో పరీక్షలను నిర్వహించేందుకు మొగ్గు చూపుతుండగా దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.