Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ గేమ్స్ కోసం తండ్రికే టోకరా!

By:  Tupaki Desk   |   7 Sep 2019 1:30 AM GMT
ఆన్ లైన్ గేమ్స్ కోసం తండ్రికే టోకరా!
X
మొబైల్ ఫోన్ తెచ్చిన విప్లవం ఏమో కానీ.. ఇప్పుడు ఆ ఫోన్ల వల్ల పిల్లలు చెడిపోతున్నారన్నది మాత్రం వాస్తవం. ఇంటికి వస్తే చాలు మొబైల్ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ మునిగిపోతున్నారు. పబ్జి లాంటి ప్రమాదకరమైన గేమ్స్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ గేమింగ్ అనేది పిల్లల పాలిట వ్యసనంగా మారింది.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కూడా ఓ నాలుగో తరగతి బాలుడికి ఈ ఆన్ లైన్ గేమ్ లు అంటే పిచ్చి. ఎప్పుడు ఖాళీ దొరికినా తండ్రి ఫోన్ తీసుకొని గేమ్ లు డౌన్ లోడ్ చేస్తూ ఆడేవాడు.అయితే కొన్ని ఆన్ లైన్ గేములు డౌన్ లోడ్ చేయాలంటే అందుకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. దీంతో ఆ డబ్బులు ఎలాకట్టాలో తెలియక బాలుడు సతమతమయ్యాడు. ఆ గేములు ఆడాలనే ఆత్రుతతో తండ్రికే టోకరా వేసిన వైనం వెలుగుచూసింది.

తండ్రి మొబైల్ లోనే తండ్రికే తెలియకుండా పేటీఎం వ్యాలెట్ ను సృష్టించిన నాలుగోతరగతి బాలుడు.. ఆన్ లైన్ లో గేమ్ లు కొని డౌన్ లోడ్ చేసుకుంటూ తండ్రి పేటీఎం ద్వారా ఏకంగా 35000 ఖర్చు చేశాడు. తన ఖాతా నుంచి వరుసగా డబ్బు విత్ డ్రా అవ్వడం చూసిన తండ్రి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు ఆరాతీసినా విషయం కనుక్కోలేకపోయారు. చివరకు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయగా వారు వచ్చి ఫోన్లో గేములు చూసి బాలుడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. అతడిని విచారించగా తనే చేశానని ఒప్పుకున్నాడు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు అనంతరం ఇంటికి పంపారు.