Begin typing your search above and press return to search.

చికెన్ వెజిటేరియనా? ఈ ప్రశ్నతో పార్లమెంటు షాక్!

By:  Tupaki Desk   |   18 July 2019 1:30 AM GMT
చికెన్ వెజిటేరియనా? ఈ ప్రశ్నతో పార్లమెంటు షాక్!
X
రాజ్యసభ సమావేశాలు లోక్ సభ అంత సందడిగా ఉండవు గాని లోతైన చర్చలకు, కొత్త సమాచారాలకు వేదిక అవుతుంటాయి. ఇటీవలే ఆయుర్వేదంపై రాజ్య సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అందరూ ఆశ్చర్యపోయే ఒక ప్రశ్న సంధించారు శివసేనకు చెందిన ఎంపీ సంజయ్ రౌత్. ఇంతకాలం అందరికీ గుడ్లు శాఖాహారమా? మాంసాహారమా? అన్న అనుమానం మాత్రమే ఉండేది. కానీ ఈ ఎంపీ గారు చికెన్ శాఖాహారామా? మాంసాహారమా? అని ప్రశ్న వేసి అందరినీ షాక్ గురిచేశారు. ఇది నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే, సంజయ్ కి ఈ అనుమానం రావడానికి దారితీసిన ఓ సంఘటన ఉదహరించారు. గతంలో ఓసారి ఆయన ఓ పర్యటనలో ఆదివాసీల వద్దకు వెళ్లారట. నందుర్బర్ ప్రాంతంలోని కుగ్రామం అట అది. సరే ఆకలిగా ఉంది కదా... ఆదివాసీల భోజనం ఎలా ఉంటుందో చూద్దాం అని వారు ఏర్పాటు చేసిన భోజనం చేయడానికి సంజయ్ సిద్ధమయ్యారు. ఇదేం భోజనం? అని ప్రశ్నించగా? ఇది ఉత్తమ పోషకాలు ఉండే ఆయుర్వేదిక్ చికెన్ అని వారు వివరించారట. ఆయుర్వేదంలో మాంసాహారం ప్రస్తావన ఉండదు కదా. వారు ఆయుర్వేదిక్ చికెన్ అనేటప్పటికి అసలు చికెన్ మాంసాహారమా? శాఖాహారమా? అన్న అనుమానం వచ్చింది ఈ ఎంపీ గారికి! ఆ సందేహాన్ని తనలోనే ఉంచుకుని తాజాగా దొరికిన అవకాశంతో బయటపెట్టేశారు. ఆ ఒక్కదానికే ఇంత అనుమానమా? అనుకోవచ్చు. అంతేకాదు, ఆయన అనుమానం బలపడటానికి ఇంకో కారణం కూడా ఉంది. చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ వారు ఆయుర్వేదిక్ ఎగ్స్ పై పరిశోధన చేయడం కూడా ఆయన దృష్టికి వచ్చిందట. మరి యూనివర్సిటీయే ఆయుర్వేదిక్ ఎగ్స్ గురించి మాట్లాడుతుంటే ఏమో చికెన్ కూడా శాఖాహారమేమో అని ఆయనకు సందేహం కలిగింది. చికెన్ శాఖా హారం అంటే... ఇంకేమైనా ఉందా... వెంటనే అది మటన్ కంటే ఎక్కువ రేటు పెరిగిపోదూ !