Begin typing your search above and press return to search.

గంగ కోసం 111 రోజుల దీక్ష‌.. ప్రాణ‌త్యాగం

By:  Tupaki Desk   |   12 Oct 2018 4:34 AM GMT
గంగ కోసం 111 రోజుల దీక్ష‌.. ప్రాణ‌త్యాగం
X
నీతుల చెప్పే ప్ర‌ధాన‌మంత్రి అన్నంత‌నే దేశ ప్ర‌జ‌ల‌కు న‌రేంద్ర మోడీ చ‌ప్పున గుర్తుకు వ‌స్తారు. మైకు క‌నిపిస్తే చాలు.. ఆయ‌న‌లోని మ‌రో మ‌నిషి నిద్ర లేస్తారు. త‌నకున్న అద్భుత‌మైన మాటల చాతుర్యంతో మంత్ర‌ముగ్గుల్ని చేస్తారు. ఇలాంటోడి చేతుల్లో దేశాన్ని అప్ప‌గిస్తే చాల‌న్న న‌మ్మ‌కాన్ని క‌లిగించేలా మాట్లాడి భ‌రోసా ఇస్తారు.

ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి నాలుగున్న‌రేళ్లు అవుతోంది. ఇంత‌కీ మోడీ సాబ్ ఏం సాధించారంటే.. పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల్ని రికార్డు స్థాయికి తీసుకెళ్ల‌ట‌మే కాదు.. డాల‌రుతో రూపాయి మార‌కం విలువ చారిత్ర‌క స్థితికి తీసుకెళ్లిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. అంతేనా .. జీఎస్టీ ప‌న్నుపోటుతో బాదేయ‌ట‌మే కాదు.. రాఫెల్ డీల్ తో వేలాది కోట్ల ప్ర‌యోజ‌నాన్ని న‌చ్చినోళ్ల‌కు ఇచ్చేసే తెగింపు త‌న‌లో ఉంద‌న్న కొద్ద కోణాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీకి ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పే గంగాన‌ది ప‌రిర‌క్ష‌ణ కోసం ఒక ప్రొఫెస‌ర్ దీక్ష చేసి ప్రాణ‌త్యాగం చేసిన వైనం షాకిస్తుంది. మోడీకి ఎంతో ఇష్టంగా.. గంగ శుద్ధే త‌న ల‌క్ష్యంగా ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. అదే విష‌యం మీద ఒక ప్రొఫెస‌ర్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న దీక్ష‌కు ప్ర‌ధాని ఎందుకు స్పందించ‌లేద‌న్న‌ది అర్థం కానిది.

గంగ ప్ర‌క్షాళ‌న కోసం త‌న జీవితాన్ని ప‌ణంగా పెట్టిన ఆ ప్రొఫెస‌ర్ గారి చేతుల్లో గంగ ప్రాజెక్టు పెట్టి.. మాష్టారు.. మీరు గంగ‌ను చూడండి.. మీరేం కోరుకుంటే అది మీకు అందిస్తాన‌న్న నిజాయితీ మాట‌లు మోడీ నోటి నుంచి వ‌చ్చి ఉంటే.. ఒక అరుదైన వ్క‌క్తి ఈ రోజుకు జీవించి ఉండేవారేమో?

కాన్పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెస‌ర్ అయిన అగ‌ర్వాల్‌కు గంగ ప్రక్షాళ‌నే త‌న జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు. గంగ‌ను కాలుష్య ర‌హితంగా చేయాల‌ని.. దాని ప్ర‌వాహాన్ని నిరోధించొద్దంటూ కోరుతూ ప్రొఫెస‌ర్ గారు దీక్ష మొద‌లెట్టారు. వార‌మో.. రెండు వారాలోకాకుండా ఏకంగా 111 రోజుల దీక్ష‌తో ఆయ‌న ఆరోగ్యం దెబ్బ‌తింది.

అనంత‌రం ఆయ‌న్ను ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. అక్క‌డ చికిత్స చేస్తుండ‌గా ఆయ‌న‌కు గుండె నొప్పి వ‌చ్చి మ‌ర‌ణించిన‌ట్లుగా వైద్యులు పేర్కొంటున్నారు. కాన్పూర్ ఐఐటీలో ఎన్విరాన‌మెంట‌ల్ ఇంజ‌నీరింగ్ విబాగంలో ప్రొఫెస‌ర్ గా ప‌ని చేసిన ఆయ‌న కేంద్ర కాలుష్య నియంత్ర‌ణ బోర్డు మెంబ‌ర్ సెక్ర‌ట‌రీగా ప‌ని చేశారు.
ఆరేళ్ల క్రితం (2012)లో స‌న్యాసం స్వీక‌రించిన ఆయ‌న‌.. త‌న పేరును స్వామి జ్ఞాన స్వరూప్‌ సనంద్‌గా మార్చేసుకున్నారు. ఆయ‌న చేప‌ట్టిన గంగ ఆందోళ‌న‌కు అన్నా హ‌జారే లాంటోళ్లు స్పందించారు. నాటి యూపీఏ స‌ర్కారు స్పందించి ఆయ‌న్ను నేష‌న‌ల్ గంగా రివ‌ర్ బేసిన అథారిటీ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

మౌన ప్ర‌ధానిగా పేరున్న మ‌న్మోహ‌న్ ప్ర‌భుత్వంలోనే ప్రొఫెస‌ర్ గారికి ఇంత గుర్తింపు ల‌భిస్తే.. గంగ‌ను శుద్ది చేయ‌ట‌మే త‌న ల‌క్ష్యంగా చెప్పుకునే మోడీ మాష్టారు.. ఈ ప్రాజెక్టు విష‌యంలో ప్రొఫెస‌ర్ గారికి అప్ప‌గించ‌క‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. 111 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయ‌న వైనం ప్ర‌ధాని దృష్టికి వెళ్ల‌లేదంటే ఏం జ‌రిగిన‌ట్లు? గ‌ంగ ప్ర‌క్షాళ‌న కోసం వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కూ గుర్తించే మార్పు అయితే జ‌ర‌గ‌లేద‌న్న‌ది నిజం. గంగ కోసం జీవితాల్ని ప‌ణంగాపెట్టే వారికి దాని ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించని మోడీ మాష్టారు లాంటోళ్లు ప‌వ‌ర్లో ఉన్నంత కాలం.. నిస్వార్థంగా జీవించే ప్రొఫెస‌ర్లు లాంటోళ్లు దీక్ష చేసి మ‌రీ ప్రాణ త్యాగం చేస్తుంటారంతే.