Begin typing your search above and press return to search.

వైసీపీ ప్రభంజనానికి కారణాలు 'ఈ రెండే’నా ?

By:  Tupaki Desk   |   15 March 2021 4:30 AM GMT
వైసీపీ ప్రభంజనానికి కారణాలు ఈ  రెండే’నా ?
X
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రచరిత్రలోనే అధికారపార్టీ గెలుపు ఓ ప్రభంజనం అనే చెప్పాలి. ఏకపక్షంగా ఇంతటి విజయాన్ని గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా సాధించలేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు అధికారపార్టీకే అనుకూలంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ మరీ ఈ స్ధాయిలో ఏకపక్షంగా ఉంటాయని అనుకోలేదు.

అంతా బాగానే ఉంది మరి ఇంతటి ప్రభంజనానికి కారణాలు ఏమిటి ? ఏమిటంటే వైసీపీ వర్గాలు రెండింటిని చెబుతున్నారు. మొదటిదేమో సంక్షేమ పథకాలు అమలు చేయటం. ఇక రెండో కారణం ఏమిటంటే కరోనా వైరస్ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవటం. సంక్షేమ పథకాల విషయానికి వస్తే గ్రామీణ, పట్టణ, నగరాలన్న తేడా లేకుండా అర్హత కలిగిన కుటుంబాలకు పథకాలు అందుతున్నాయి. చాలా కుటుంబాలు ఒకటికి మించి పథకాలనే అందుకుంటున్నాయి.

పథకాల అమలులో అక్కడక్కడ లోపాలున్నా హోలు మొత్తం మీద లబ్దిదారుల సంఖ్య అయితే కోట్లలోనే ఉంది. ఆమధ్య ప్రభుత్వమే చెప్పినట్లుగా సుమారు 5 కోట్ల జనాభాలో ప్రభుత్వ పథకాల వల్ల లబ్దిపొందుతున్న వారి సంఖ్య సుమారు 3.9 కోట్లమంది. తమ సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నడన్న కారణంగానే జనాలు కూడా వైసీపీకి ఏకపక్ష విజయాన్ని అందించి రిటర్న్ గిఫ్ట్ అందించారు.

ఇక కరోనా వైరస్ సమస్యనే తీసుకుంటే నెలల తరబడి జనాల్లో అత్యధికులు ఇళ్ళకే పరిమితమైపోయారు. వీరిలో నిరుపేదలు, మధ్య తరగతి జనాల సంఖ్యే ఎక్కువుంది. వీరందరికీ వివిధ పథకాల రూపంలో నెలల తరబడి బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనెలు ఇచ్చి అదనంగా రెండు వేల రూపాయలు అందించారు. పేదలను ఆదుకోవటంలో కేంద్రప్రభుత్వం వాటా కూడా ఉన్నా క్రెడిట్ మొత్తం రాష్ట్రప్రభుత్వం ఖాతాలోనే పడింది.

ఇదే సమయంలో కరోనాను ఎదుర్కోవటంలో ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసిందని మెజారిటి జనాలు అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళటం అనారోగ్యంతో ఉన్న వాళ్ళ గురించి వాకాబు చేయటం, ప్రభుత్వం అందించిన కిట్లను పంపిణీ చేయటం, అవసరమైన వాళ్ళ ఇళ్ళకు డాక్టర్లను తీసుకువెళ్ళారు. ఇది ఒకసారితో ఆగిపోకుండా నెలల తరబడి వాలంటీర్లు ఇల్లిల్లు తిరిగారు. దాంతో పేదలు, మధ్య తరగతి కుటుంబాల్లో ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడిందని సమాచారం. వైసీపీ ఇంతటి ప్రభంజనానికి ఈ రెండే ప్రధాన కారణాలుగా అంచనా వేస్తున్నారు.