Begin typing your search above and press return to search.
ఢిల్లీలో బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలిందే!
By: Tupaki Desk | 10 Sep 2017 12:52 PM GMTకేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన కమలనాథులు దేశ రాజధాని ఢిల్లీ పాలనా పగ్గాలను మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. యూపీఏ హయాంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన ఆప్... అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీ సర్కారును ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో శాంతిభద్రతల బాధ్యతల విషయంపై కేంద్రంతో వచ్చిన వివాదం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన కేజ్రీ.. ఏడాది వ్యవధిలోనే ఢిల్లీ అసెంబ్లీకి రెండో దఫా ఎన్నికలు జరిగేలా చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలో జరిగిన ఈ ఎన్నికల్లోనే కేజ్రీ నేతృత్వంలో ముందుకు సాగిన ఆప్ మరింత బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే... కేంద్రంలో యూపీఏ ఉన్నా... ఎన్డీఏ ఉన్నా... డిల్లీ ప్రజలు మాత్రం కేజ్రీకే పట్టం కట్టారన్న మాట.
ఇక ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లోనూ అటు కమలనాథులతో పాటు ఇటు కాంగ్రెస్ నేతలకు కూడా గడ్డు పరిస్థితులే తప్పవని మరోమారు తేలిపోయింది. వర్సిటీకి సంబంధించి విద్యార్థి సంఘం ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఘోర పరాజయం పాలైంది. బీజేపీ వింగ్ ఓడిందంటే... కాంగ్రెస్ స్టూడెంట్ విభాగం ఎన్ ఎస్ యూఐ గెలిచినట్లు కాదు. అక్కడ ఏబీవీపీని ఓడించింది లెఫ్ట్ పార్టీల ఐక్య కూటమి(ఏఐఎస్ ఏ) పేరుతో బరిలోకి దిగిన వామపక్ష పార్టీలకు అనుకూలంగా ఉన్న విద్యార్థుల సమూహమట. విద్యార్థి సంఘంలోని అన్ని పదవులకు జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ సింగిల్ సీటును దక్కించుకోలేకపోగా... మొత్తం అన్ని పదవులను గెలుచుకుని ఏఐఎస్ఏ విజయ ఢంకా మోగించింది.
స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ పదవికి పోటీపడిన ఏఐఎస్ఏ అభ్యర్థి గీతా కుమారి, ఏబీవీపీకి చెందిన నిధి త్రిపాఠిని 464 ఓట్ల తేడాతో ఓడించారు. ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డ ఏబీవీపీ అభ్యర్థి దుర్గేష్ కుమార్‌కు 1028 ఓట్లు రాగా, ఏఐఎస్ఏ అభ్యర్థి సిమోన్ జోయా ఖాన్‌కు 1,876 ఓట్లు వచ్చాయట. జనరల్ సెక్రటరీ పోస్టుకు ఏఐఎస్ఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన దుగ్గిరాల శ్రీకృష్ణ 2,082 ఓట్లు తెచ్చుకున్నాడు. అతడి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన ఏబీవీపీ అభ్యర్థి నికుంజ్ మక్వానా 975 ఓట్లతో సరిపెట్టుకున్నాడు. జాయింట్ సెక్రటరీ పదవికి పోటీ పడ్డ ఏఐఎస్ఏ అభ్యర్థి శుభాన్షు సింగ్‌కు 1,755 ఓట్లు రాగా... ఏబీవీపీ అభ్యర్థి పంకజ్ కేసరికి 920 ఓట్లు వచ్చాయి.
ఈ ఫలితాలపై ఏఐఎస్ ఏ హర్షం వ్యక్తం చేయగా, ఏబీవీపీ మాత్రం తమదైన శైలిలో కొత్త వాదనను వినిపించింది. ప్రజలకు - విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంకా ఉందని, అందుకే తాము గెలిచామని స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా గెలిచిన గీతా కుమారి అన్నారు. అయితే ఇందుకు కాస్తంత భిన్నంగా ప్రతిస్పందించిన ఏబీవీపీ అభ్యర్థి నిధి త్రిఫాఠి... తాము ఓడిపోలేదని, పలు గ్రూప్ లు కలిసి ఏబీవీపీని ఓడించేందుకు ఏకమయ్యాయని ఆరోపించారు.