Begin typing your search above and press return to search.

తెలంగాణా లెక్క చేస్తుందా ?

By:  Tupaki Desk   |   30 Aug 2022 5:03 AM GMT
తెలంగాణా లెక్క చేస్తుందా ?
X
తెలంగాణా ప్రభుత్వం ఏపీ జెన్కోకు చెల్లించకుండా చాలాకాలంగా పెండింగ్ లో ఉంచిన బకాయిలను వెంటనే చెల్లించేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

విభజన చట్టం ప్రకారం గడచిన ఎనిమిదేళ్ళల్లో తెలంగాణా ప్రభుత్వం నుండి ఏపీ జెన్కోకు రు. 6756 కోట్లు చెల్లించాలి. ఇందులో జెన్కో సరఫరా చేసిన విద్యుత్ చార్జీలు రూ. 3441 కోట్లే. కాకపోతే చెల్లించాల్సిన బకాయిలు చెల్లించనందుకు సర్ చార్జీలు రూ. 3315 కోట్ల కలిపి మొత్తం 6756 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే అని ఫైనల్ గా ఆదేశించింది.

పై మొత్తం చెల్లించటానికి తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రం నెలరోజుల గడువిచ్చింది. ఈ సమస్య రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి నలుగుతున్నదే. గతంలో ఏపీ ప్రభుత్వం ఎంత చెప్పినా, కేంద్రం ఎన్నిసార్లు ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం లెక్కచేయటం లేదు.

ఇపుడు తాను ఇచ్చిన ఆదేశాలే ఫైనలన్నట్లుగా కేంద్రం చాలా ఘాటుగానే తెలంగాణా ప్రభుత్వానికి లేఖ రాసింది. తాము ఇమ్మంటేనే ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందన్న విషయాన్ని తాజా లేఖలో కేంద్రప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వానికి గుర్తుచేసింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రం ఆదేశాలను తెలంగాణా ప్రభుత్వం లెక్క చేస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఇపుడు రాసిన లేఖను కూడా తెలంగాణా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం రాసిన లేఖ ఏకపక్షంగా ఉందన్నారు. తమకే ఏపీ ప్రభుత్వం విద్యుత్ బకాయిలు చెల్లించాల్సుంటే ఉల్టాగా తమనే ఏపీకి బకాయిలు చెల్లించాలని కేంద్రం లేఖలో ఆదేశించటం విచిత్రంగా ఉందన్నారు.

ఏపీ ప్రభుత్వం నుండి తెలంగాణాకు రు. 12941 కోట్లు బకాయిలు రావాల్సిన మాటేమిటంటు మంత్రి కేంద్రాన్ని నిలదీశారు. తమకు రావాల్సిన బకాయిల విషయాన్ని ఎన్నిసార్లు ప్రస్తావించినా కేంద్రం పట్టించుకోవటం లేదని మంత్రి ఎదురుదాడి మొదలుపెట్టారు. మంత్రి వాలకం చూస్తుంటే కేంద్రం ఆదేశాలను తెలంగాణా ప్రభుత్వం ఆచరిస్తుందన్న నమ్మకం ఎవరికీ కలగటం లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఇలాంటి గొడవలు ఇంకెంత కాలం జరుగుతాయ అర్థం కావటం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.