Begin typing your search above and press return to search.

నీలోఫర్ స్కామ్.. మరింత చిక్కుల్లో మంత్రి ఈటల.?

By:  Tupaki Desk   |   30 Sep 2019 2:30 PM GMT
నీలోఫర్ స్కామ్.. మరింత చిక్కుల్లో మంత్రి ఈటల.?
X
తెల్లవారితే తెలంగాణ మంత్రి విస్తరణ.. అయినా మంత్రిగా ఈటెల రాజేందర్ కు చోటు దక్కలేదు. అర్థరాత్రి సీఎంవో నుంచి ఫోన్ చేసి మంత్రిగా ప్రమాణానికి రెడీగా ఉండాలని కోరారు. దీంతో అప్పటి నుంచే మంత్రి ఈటల విషయంలో వివక్ష కొనసాగుతోందని.. ఆయనను తప్పించే ప్రయత్నాలు టీఆర్ఎస్ లో జరిగాయన్నది ఆయన అనుయాయుల ఆరోపణ. ఓ సందర్భంలో ఈటల కూడా బయటపడి కేసీఆర్ తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.. గులాబీకి ఓనర్లం మేమే అంటూ అసమ్మతి వ్యాఖ్యలు మాట్లాడారు. టీఆర్ఎస్ లో తనను సాగనంపే ప్రయత్నాలపై మండిపడ్డారు.

తాజాగా మంత్రి ఈటల పోస్టుకు ఎసరు తెచ్చే ఘటన మరొకటి చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్నపిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ కుంభకోణంలో మంత్రి ఈటల రాజేందర్ ఇరుక్కుపోయారన్న చర్చ గులాబీ పార్టీలో సాగుతోందట.. ఈ కుంభకోణంపై విచారణకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

చాలాకాలంగా నీలోఫర్ ఆస్పత్రిలో ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చినా వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఏం చేశారన్న ప్రశ్న ఇప్పుడు ఆయనకు ఎదురవుతోంది. ఆయనకు తెలిసే ఈ దందా జరిగిందా అన్న అనుమానాలను కొందరు ఆయనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

గులాబీ పార్టీకి ఓనర్లం మేమే అంటూ కేసీఆర్ పై ఎదురుతిరిగిన ఈటల రాజేందర్ చూస్తున్న శాఖలోనే ఇలాంటి వివాదాస్పద క్లినికల్ ట్రయల్స్ చోటుచేసుకోవడంతో ఆయన పోస్టుకు ఎసరు తెచ్చేలా ఈ వ్యవహారం ఉందన్న వాదనలు గులాబీ పార్టీలో కొనసాగుతున్నాయి. మరి ఈటెల ఈ విమర్శలను ఎలా ఎదుర్కొంటాడన్నది వేచిచూడాలి.