Begin typing your search above and press return to search.

అక్కడ హిల్లరీ కిందపడిపోయారట

By:  Tupaki Desk   |   12 Sept 2016 11:16 AM IST
అక్కడ హిల్లరీ కిందపడిపోయారట
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనుకోని పరిణామం చోటు చేసుకుంది. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆరోగ్యంపై రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పలు ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. ట్రంప్ ఆరోపణలకు బలం చేకూరే ఘటన తాజాగా చోటు చేసుకుంది. హిల్లరీ అమెరికా అధ్యక్ష పదవికి సరిపోరని.. ఆమె ఆరోగ్యం సరిగా లేదని ట్రంప్ విమర్శిస్తున్నారు. అయితే.. ట్రంప్ ఆరోపణల్లో నిజం లేదంటూ ఆమెకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ లను డెమొక్రాట్లు విడుదల చేశారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా తాజాగా 9/11 స్మారకార్థం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హిల్లరీ అకస్మాత్తుగా కిందకు పడిపోయినట్లుగా చెబుతున్నారు. ఆమె ఉన్నట్లుండి పడిపోవటంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆమె శరీరంలో చోటు చేసుకున్న ఉష్ణోగ్రతల మార్పులతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని. ఆమెకు న్యూమోనియా సోకినట్లుగా వార్తలు వస్తున్నాయి.

9/11 మెమోరియల్ ఈవెంట్ వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో ఆమె వ్యక్తిగత సిబ్బంది హిల్లరీని వెంటనే తమతో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె తన కుమార్తె చెల్సియా నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ఘటనను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. హిల్లరీ ఆరోగ్యంపై తాను చేసిన విమర్శ నిజమన్న విషయాన్ని తాజా ఘటన స్పష్టం చేసినట్లుగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. హిల్లరీ అనారోగ్యం ఆమె విజయవకాశాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న సందేహాల్ని డెమొక్రాట్లు చేస్తున్నారు. తాజా పరిణామాలతో హిల్లరీ మానసిక స్థితిపై ట్రంప్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అరోగ్యం సరిగా లేని నేపథ్యంలో నిధుల సమీకరణ కోసం కాలిఫోర్నియాలో జరగాల్సిన హిల్లరీ సభను రద్దు చేశారు. మొత్తంగా చూస్తే హిల్లరీ అనారోగ్యంపై ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చే నడుస్తోంది.