Begin typing your search above and press return to search.

హిల్లరీ టైం బాగోలేదా?

By:  Tupaki Desk   |   11 May 2016 7:35 AM GMT
హిల్లరీ టైం బాగోలేదా?
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తుది అభ్యర్థిగా ఎంపిక కావటమే కాదు.. ఎన్నికల్లో ఆమె విజయం సాధించి వైట్ హౌస్ లోకి అడుగుపెడతారంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా చెప్పిన హిల్లరీ క్లింటన్ పరిస్థితి ఇప్పుడంత బాగోలేదనే చెప్పాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకి ప్రత్యర్థిగా భావిస్తున్న రిపబ్లికన్ నేత ట్రంప్ అభ్యర్థిత్వం మీద ఉన్న సందేహాలు తొలిగిపోయి.. ఆయన తప్ప మరొకరు లేరన్నట్లుగా పరిస్థితి మారితే.. మరోవైపు హిల్లరీ తుది అభ్యర్థిత్వం ఖరారు కాక కిందామీదా పడుతున్నారు.

ప్రైమరీ ఎన్నికల్లో హిల్లరీకి పోటీగా ఉన్న సొంత పార్టీ అభ్యర్థి శాండర్స్ ఇప్పుడామెకు గండంగా మారారు. తాజాగా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో హిల్లరీ ఓటమిపాలు కాగా.. శాండర్స్ విజయం సాధించారు. దీంతో ఇప్పటివరకూ శాండర్స్ 19 రాష్ట్రాల్లో విజయం సాధించినట్లైంది. తాజా విజయంతో మాంచి హుషారులో ఉన్న శాండర్స్ చివరివరకూ పోరాడతానని చెప్పటం హిల్లరీకి ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు.

ఒకపక్క తన ప్రధాన ప్రత్యర్థి ట్రంప్ ఎదురులేని రీతిలో దూసుకెళుతుంటే.. మరోపక్క హిల్లరీకి ఇంటిపోరులోనే ముందంజలో లేకపోవటం ఇబ్బందికరంగా మారింది. రచ్చ గెలవటానికి ముందు ఇంట గెలవాల్సిన హిల్లరీ.. ఆ విషయంలో ఎంత ఆలస్యం చేస్తే.. ఆమె పరిస్థితి అంత ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. హిల్లరీ టైం ఇప్పుడు బాగోలేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.