Begin typing your search above and press return to search.

క్లౌడ్ బరస్ట్ కుట్ర: కేసీఆర్ కు తమిళిసై కౌంటర్

By:  Tupaki Desk   |   19 July 2022 11:38 AM GMT
క్లౌడ్ బరస్ట్ కుట్ర: కేసీఆర్ కు తమిళిసై కౌంటర్
X
తెలంగాణలో ఇప్పుడు సీఎం కేసీఆర్ చేసిన ‘క్లౌడ్ బరస్ట్’ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణలో భారీ వరదలకు విదేశీయులు చేసిన ‘క్లౌడ్ బరెస్ట్’ కుట్ర కారణమని ఆయన ఆరోపించడం సంచలనమైంది. ఇవి సహజంగా కొట్టిన వానలు కావని.. దీనివెనుక పెద్ద కుట్ర ఉందని కేసీఆర్ అనుమానించారు. దేశంలో వర్ష బీభత్సానికి విదేశీయుల కుట్ర అనడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీనిపై నిప్పులు చెరిగారు. ప్రపంచంలోనే మేధావి కేసీఆర్ చెప్పిండయ్యా అంటూ ఎద్దేవా చేశారు.

క్లౌడ్ బరస్ట్ పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరికి సంభవించిన వరదల వెనుక క్లౌడ్ బరస్ట్ కుట్ర దాగి ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ నాయకులు ఎదురుదాడి చేశారు. కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. వరద సహాయక చర్యల్లో విఫలం కావడం వల్లే కేసీఆర్ ఈ కుట్ర ఆరోపణలు తెరపైకి తెచ్చారంటూ మండిపడుతున్నారు.

ఈ క్లౌడ్ బరెస్ట్ ఆరోపణలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా కేసీఆర్.. క్లౌడ్ బరస్ట్ ఆరోపణలను ఆమె ఖండించారు. కేసీఆర్ పర్యటించిన రోజే గవర్నర్ కూడా భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోనే పర్యటించారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు. బాధితులను పరామర్శించారు.

గోదావరికి వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తమిళి సై అన్నారు.నదీ పరివాహక ప్రాంతంలో ప్రతి సంవత్సరం భారీ వర్షాలు కురుస్తూనే వస్తున్నాయని.. వాటి ఫలితంగా వరదలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఆ సీజన్ లో వరదల తీవ్రత అధికంగా ఉంటుందని తమిళి సై క్లారిటీ ఇచ్చారు. దీనికి క్లౌడ్ బరస్ట్ అని పేరు పెట్టడంలో అర్థం లేదని తేల్చిచెప్పారు. లఢక్, ఉత్తరాఖండ్ లలో క్లౌడ్ బరెస్ట్ ప్రతి సంవత్సరం సంభవిస్తుంటాయని..తెలంగాణలో అలాంటి అవకాశాలు లేవని తమిళిసై క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కు, తమిళిసైకి అస్సలు పడడం లేదు. ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు కేసీఆర్ కు మరో కౌంటర్ ఇచ్చి తమిళిసై వార్తల్లో నిలిచారు. ఒకే రోజు ఒకే అంశం మీద.. గవర్నర్, సీఎం వేర్వేరుగా సమీక్షలను నిర్వహించడంతో ఈ విభేదాలు మరింత పతాకస్థాయికి చేరాయి.