Begin typing your search above and press return to search.

త‌రుణ్ విచార‌ణ‌లో క్లూస్ టీం?

By:  Tupaki Desk   |   23 July 2017 4:33 AM GMT
త‌రుణ్ విచార‌ణ‌లో క్లూస్ టీం?
X
డ్ర‌గ్స్ కేసుకు సంబంధించిన విచార‌ణ గ‌డిచిన కొద్ది రోజులుగా జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ కు సంబంధించిన ప‌లువురు సెల‌బ్రిటీల‌ను వ‌రుస‌గా విచారిస్తున్నారు. ఇందులో భాగంగా శ‌నివారం గ‌తంలో యువ హీరోగా సుప‌రిచితుడైన త‌రుణ్‌ ను విచారించారు. ఇప్ప‌టివ‌ర‌కూ విచారించిన తీరుకు భిన్నమైన ఘ‌ట‌న ఒక‌టి త‌రుణ్ విచార‌ణ సంద‌ర్భంగా చోటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

త‌రుణ్ విచార‌ణ స‌మ‌యంలో క్లూస్ టీం సిట్ కార్యాల‌యానికి రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. వేలిముద్ర‌లు.. ఇత‌ర ఆధారాలు సేక‌రించే క్లూస్ టీం త‌రుణ్ విచార‌ణ చేస్తున్న సిట్ కార్యాల‌యానికి ఎందుకు వ‌చ్చింద‌న్న విష‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌రుణ్ విచార‌ణ కోస‌మే వారిని ర‌ప్పించిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ వెలువ‌డ‌లేదు.

విశ్వ‌స‌నీయ పోలీసు వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. త‌రుణ్ విచార‌ణ‌కు క్లూస్ టీం కూడా పొల్గొన్న‌ట్లుగా స‌మాచారం. డ్ర‌గ్స్ కేసులో కీల‌క నిందితులైన కెల్విన్‌.. జీశాన్ కు సంబంధించిన ఎల్ ఎస్ డీ స్ట్రిప్పులు.. ఇత‌ర డ్ర‌గ్ ప్యాకెట్ల పైనా వారి వేలిముద్ర‌ల్ని సేక‌రించిన అధికారులు.. తాజాగా త‌రుణ్ వేలిముద్ర‌లు సేక‌రించ‌టం పలు సందేహాల‌కు తావిస్తోంది. డ్ర‌గ్స్ ప్యాకెట్లు.. ఎల్ ఎస్ డీ స్ట్రిప్పుల‌పై త‌రుణ్ వేలి ముద్ర‌ల్ని స‌రిపోల్చేందుకే వేలి ముద్ర‌లు తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ వాద‌న‌ల‌పై సిట్ స్పందించ‌లేదు. క్లూస్ బృందం ఎందుకు వ‌చ్చింద‌న్న విష‌యంపై ఎలాంటి స‌మాచారాన్ని వెల్ల‌డించ‌లేదు. ఏమైనా.. త‌రుణ్ విచార‌ణ‌లో క్లూస్ టీం కీల‌క భూమిక పోషించింద‌న‌టంలో సందేహం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.