Begin typing your search above and press return to search.

షాకిస్తారనుకుంటే.. స్వీట్ న్యూస్ చెప్పిన సీఎం

By:  Tupaki Desk   |   2 Aug 2020 5:30 AM GMT
షాకిస్తారనుకుంటే.. స్వీట్ న్యూస్ చెప్పిన సీఎం
X
కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన రాజస్థాన్ ప్రభుత్వ సంక్షోభం ఒక కొలిక్కి రావటం తెలిసిందే. ప్రభుత్వ కూలిపోతుందేమోనన్న దిగులు నుంచి.. ఫర్లేదన్న భరోసా ఇప్పటికే వచ్చింది. ఈ మొత్తానికి కారణమైన సచిన్ పైలెట్ బింకం ప్రదర్శిస్తున్నా.. ఆయన చేయగలిగిందేమీ లేదన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే పట్టు పెంచుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ ఆసక్తికర వ్యాఖ్యను చేశారు. ఒక విధంగా చూస్తే.. తోక జాడించిన ఎమ్మెల్యేలు బుద్ధిగా వెనక్కి వస్తే.. ఎలాంటి చర్యలు ఉండవు సరికదా.. వారిని సాదరంగా ఆహ్వానిస్తామన్న స్వీట్ న్యూస్ చెప్పటం ఆసక్తికరంగా మారింది.

అయితే.. తానీ పని చేయటానికి ఒక కండిషన్ పెట్టారు. పార్టీ అధిష్ఠానం క్షమిస్తేనే తాను వారిని ఆక్కున చేర్చుకుంటానని చెప్పటం ద్వారా.. అధినాయకత్వానికి తానెంత విధేయుడ్ని అన్న విషయాన్నిచెప్పకనే చెప్పేశారు. ఈ నెల 14న అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటం.. ఆ లోపు అసమ్మతిలో చీలిక తీసుకురావటం ద్వారా తల ఎగరేసిన సచిన్ పైలెట్ సంగతి చూడాలన్నదే కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు.

ప్రస్తుతానికి తమ ఎమ్మెల్యేలందరిని జైసల్మీర్ లోని సూర్యగఢ్ రిసార్టుకు తరలించి.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సదరు ఎమ్మెల్యేల్నికలిసిన ముఖ్యమంత్రి గెహ్లాత్.. వారితో మాట్లాడి.. తాజా పరిణామాల గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉన్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ కు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. న్న పార్టీలతో కలిసి.. గండం నుంచి గట్టెక్కాలన్న యోచనలో కాంగ్రెస్ ఉంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో చీలిక ద్వారా ప్రభుత్వాన్ని కాపాడుకునేలా ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా తిరుగబాటు ఎమ్మెల్యేలు సొంతగూటికి చేరుకోవటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేయటం ద్వారా.. తమ ప్రభుత్వానికి ఢోకా లేదన్న ధీమాను గెహ్లాత్ ప్రదర్శిస్తున్నారని చెప్పాలి. దీనికి తోడు.. చర్యలు ఉండవన్న స్వీట్ న్యూస్ తిరుగుబాటు వర్గానికి కొంత ఉపశమనంగా మారే వీలుంది.అదే సమయంలో.. వారికి నాయకత్వం వహించిన సచిన్ పైలెట్ మీద విమర్శలు చేయని సీఎం. బీజేపీ కేంద్రమంత్రుల మీద విరుచుకుుపడటం గమనార్హం. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారని.. వారంతా తమ పదవులకు రాజీనామాలు చేయాలన్న డిమాండ్ చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.