Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్ తరలింపు ..ముహూర్తం ఫిక్స్ !

By:  Tupaki Desk   |   11 May 2020 10:10 AM GMT
ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్ తరలింపు ..ముహూర్తం ఫిక్స్ !
X
ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ అమరావతి నుండి విశాఖకు తరలించడానికి ముహూర్తం ఫిక్సయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మే 28న ఉదయం 8.30 గంటలకు విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే , గతంలో అనుకున్నట్టుగా మిలినియం టవర్స్‌లో కాకుండా విజ్ఞాన్ కాలేజీ సమీపంలోని గ్రేహౌండ్ కాంపౌండ్ ‌లో సిద్ధంగా ఉన్న భవనాల్లోకి సీఎం క్యాంప్ ఆఫీసును తరలిస్తారని ,దీనికి సంబంధించి 20 లారీల్లో ఫర్నీచర్ ఇప్పటికే విశాఖ చేరుకుందనే వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ తీసుకున్న సంచలనమైన నిర్ణయాలలో మూడు రాజధానుల ప్రకటన ముఖ్యమైనది. అమరావతిలో అసెంబ్లీని కొనసాగిస్తూ.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ గా, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్‌ గా మార్చాలని ఏపీ లో అధికారంలో ఉన్న జగన్ సర్కారు భావించింది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ ఇచ్చిన నివేదికలు సైతం ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. కానీ, ఈ మూడు రాజధానుల వ్యవహరం కోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత ఈ మహమ్మారి తీవ్రం కావడంతో..మూడు రాజధానుల అంశం గురించి ఇప్పుడు పెద్దగా ప్రస్తావన లేదు. అయితే, ఇప్పటికీ ఈ మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గని పరిస్థితుల్లో విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీసును ఎలా తరలిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.