Begin typing your search above and press return to search.

అమరావతికి గుడ్ బై ... వైజాగ్ కి సీఎం క్యాంప్ ఆఫీస్ , అనుకున్న ముహుర్తానికే అన్ని .. !

By:  Tupaki Desk   |   15 March 2021 7:33 AM GMT
అమరావతికి గుడ్ బై  ... వైజాగ్ కి సీఎం క్యాంప్ ఆఫీస్ , అనుకున్న ముహుర్తానికే అన్ని .. !
X
ఏపీలో వైసీపీ జోరు మాములుగా లేదు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో సాధించిన ఘన విజయం అధికార పార్టీ కి మరింత బూస్టప్ ను ఇచ్చింది. తాము తీసుకునే అన్ని రకాల నిర్ణయాలకు ప్రజామోదం లభించినట్టుగా భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో ఆరంభమైన దూకుడు పట్టణాలు, నగరాల్లోనూ కొనసాగడం పట్ల అన్ని వర్గాలు, ప్రాంతాలకు చెందిన తమ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఇక అదే ఊపులో ఇదివరకు ప్రభుత్వపరంగా తాము తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడానికి సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో- తొలి అడుగును పరిపాలనా రాజధానితోనే ఆరంభించాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను సాగర నగరానికి తరలించే ప్రక్రియను ముమ్మరం చేయనున్నారు. తరలింపు పనులు ఇప్పటికే ఆలస్యం అయ్యాయని, ఇక జాప్యం చేయకూడదనే నిర్ణయానికొచ్చేశారు.

రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అమరావతి సహా అన్ని ప్రాంతాల ప్రజలు అనుకూలంగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందుకున్న ఘన విజయమే దీనికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. అమరావతి నుంచి విశాఖపట్నానికి సచివాలయం, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల తరలింపు ప్రక్రియ ముఖ్యమంత్రి కార్యాలయంతోనే ఆరంభం కావచ్చనే అంటున్నారు. ముఖ్యమంత్రిగా తానే ముందుండి.. తన కార్యాలయం తరలింపుతో దీన్ని ఆరంభించే అవకాశాలు లేకపోలేదు. విశాఖలో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న భవనాల్లో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, క్రమంగా దాన్ని అనుకూలంగా ఉన్న ప్రదేశానికి మార్చుకోవచ్చని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తరలింపు ప్రక్రియకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతోనే శ్రీకారం చుడతారని అంచనా వేస్తోన్నారు.

విశాఖకు సచివాలయం తరలింపు పనులకు తెలుగుదేశం పార్టీ అడ్డుపడకపోవచ్చని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో వైసీపీ గెలిస్తే, మూడు రాజధానులకు ప్రజలు అనుకూలంగా ఉన్నారని తాము భావిస్తామని, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను గెలుచుకుంటే.. అమరావతిని ఎక్కడికైనా తరలించడానికి తాను రాసిచ్చినట్టేనని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేసిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్నాథ గట్టు వద్ద 250 ఎకరాల్లో హైకోర్టును నెలకొల్పుతామని మున్సిపల్ ఎన్నికలకు ముందే ప్రకటించింది. మున్సిపాలిటీల్లో సాధించిన విజయం ఇచ్చిన ఊపు, వేడిలోనే దీన్ని కూడా ముమ్మరం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇక జాప్యం చేయకూడదనే నిశ్చితాభిప్రాయంలో ఉన్నారు. ఉగాది నాటికి క్యాంపు కార్యాలయం తరలించే అవకాశాలు లేకపోలేదు