Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు... యూట‌ర్న్ అంకుల్ అట‌!

By:  Tupaki Desk   |   28 March 2018 11:59 AM GMT
చంద్ర‌బాబు... యూట‌ర్న్ అంకుల్ అట‌!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై ఇప్పుడు ప్ర‌తి రాజ‌కీయ పార్టీ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్న తీరు నిజంగానే గ‌తంలో ఎన్న‌డూ లేద‌నే చెప్పాలి. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌యంలో చంద్ర‌బాబు డ‌బుల్ గేమ్ ఆడార‌ని - అస‌లు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డానికి ఒక ర‌కంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హార స‌ర‌ళే కార‌ణ‌మ‌ని కూడా రాజ‌కీయ పార్టీలు ఆరోపిస్తున్న విష‌యం కూడా మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి ముందుకు సాగిన చంద్ర‌బాబు... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత లోటు బ‌డ్జెట్ తో ఏర్ప‌డ్డ ఏపీకి తొలి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా ప‌లు అంశాల్లో కేంద్రం రాష్ట్రానికి ఇతోదికంగా సాయం చేయాల్సి ఉంది. ఈ విష‌యంలో చంద్ర‌బాబు డ‌బుల్ గేమ్ ఆడార‌న్న‌ది విప‌క్షం వైసీపీ ఆరోప‌ణ‌గా వినిపిస్తోంది.

బీజేపీతో నాలుగేళ్ల పాటు క‌లిసి ప్ర‌యాణించి కూడా కేంద్రంలోని ఆ పార్టీ ప్ర‌భుత్వం నుంచి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కాదు క‌దా.. ప్ర‌త్యేక ప్యాకేజీ కింద కూడా నిధులు సాధించ‌లేక‌పోయార‌న్న‌ది వైసీపీ ఆరోప‌ణ‌గా వినిపిస్తోంది. అంతేకాకుండా ఏపీ ప్ర‌జ‌ల మ‌దిలో గ‌ట్టిగా నాటుకు పోయిన ప్ర‌త్యేక హోదా సాధ‌న క‌ల‌ను నీరుగార్చేందుకు కూడా చంద్ర‌బాబు విఫ‌ల య‌త్నం చేశార‌ని వైసీపీతో పాటు ఇత‌ర పార్టీలు కూడా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. నిన్న చంద్ర‌బాబు నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష స‌మావేశానికి హాజ‌రైన కాంగ్రెస్‌ - వామ‌ప‌క్షాలు కూడా ఇదే మాట‌ను వెలిబుచ్చాయ‌న్న వాద‌న కూడా లేకపోలేదు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఢిల్లీ వేదిక‌గా ఇప్పుడు సాగుతున్న తీవ్ర స్థాయి ఉద్య‌మం ప‌తాక స్థాయికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

ఏపీకి న్యాయం చేయ‌ని ప‌క్షంలో త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేస్తామ‌ని వైసీపీ ఎంపీలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు కూడా. త‌మ ఎంపీల‌తో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే... కేంద్రంపై మ‌రింత ఒత్తిడి పెరుగుతుంద‌ని - రాష్ట్రానికి న్యాయం జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని - ఆ దిశ‌గా టీడీపీ ఎంపీల రాజీనామాల‌కు చంద్ర‌బాబు సిద్ధ‌మేనా? అని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా స‌వాల్ విసిరారు. ఈ స‌వాల్ కు ఇప్ప‌టిదాకా టీడీపీ నుంచి స‌మాధాన‌మే రాలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో నిన్న‌టిమాదిరే... నేడు కూడా పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో మీడియా ముందుకు వ‌చ్చిన వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌ సాయిరెడ్డి... చంద్ర‌బాబుపై మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాట మార్చ‌డంలో చంద్ర‌బాబును మించిన వారు లేర‌ని, ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు... యూట‌ర్న్ అంకుల్‌ గా పేరు పెడితే బాగుంటుంద‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా త‌న టెంపోను మెయింటైన్ చేసిన విజ‌య‌ సాయిరెడ్ది... చంద్రబాబును యూట‌ర్న్ అంకుల్ చేశార‌న్న మాట‌.