Begin typing your search above and press return to search.

చిన్న వయసులోనే ఎమ్మెల్యే టికెట్‌

By:  Tupaki Desk   |   11 March 2019 8:56 AM GMT
చిన్న వయసులోనే ఎమ్మెల్యే టికెట్‌
X
ఎన్నికల రణరంగంలో దిగేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. ముందుగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్టీ అధినేత బాబు చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్లమెంట్‌ వారీగా సమీక్షలు ప్రారంభించిన ఆయన శనివారం రాత్రి అరకు లోక్‌సభతో పాటు ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు పాలకొండను మాత్రం పెండింగ్‌ లో ఉంచారు. ఇక్కడ ఎవరికి నిలబెట్టాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్‌ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌ చార్జిగా ఉన్న నిమ్మక జయకృష్ణ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే తరుణంలో ఆయన సోదరుడు నిమ్మక పాండురంగ సతీమణి బబిత కూడా ఈ స్థానంలో టికెట్‌ ఆశిస్తున్నారు. అలాగే విశాఖకు చెందిన బిల్డర్‌ కంపా హనోక్‌ పాలకొండ విషయంలో చంద్రబాబును కలిసి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ టీడీపీలోకి చేరారు. అయనతో పాటే మాజీ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయన కుమార్తె స్వాతి పేరు ఇప్పుడు తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. స్వాతి భీ ఫార్మసీ చేసింది. ఆమె భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అంతేకాకుండా ఈమె విశ్వవసరాయి నర్సింహారావు దొర కోడలు. ఈయన ఎమ్మెల్యే, ఎంపీ పదవులు చేపట్టారు. ఇలా పుట్టినిల్లు - మెట్టినిల్లు నుంచి రాజకీయ నేపథ్యం కలిగి ఉండడంతో స్వాతి పేరును చంద్రబాబు పరిశీలించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో పాలకొండ అభ్యర్థిత్వంపై పార్టీ అధినేత ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న నిమ్మక జయకృష్ణ పేరును కూడా టీడీపీ అధినేత పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా స్వాతి - జయకృష్ణల్లో ఎవరో ఒకరికి టికెట్‌ వచ్చే అవకాశం ఉందని రాజకీయంగా చర్చించుకుంటున్నారు.