Begin typing your search above and press return to search.

ఉన్నమాట అంటే చంద్రబాబుకు ఉలుకే!

By:  Tupaki Desk   |   3 Jan 2018 3:59 PM GMT
ఉన్నమాట అంటే చంద్రబాబుకు ఉలుకే!
X
‘‘ఉన్నమాట అంటే ఉలుకెక్కువ’’ అని సామెత. ఆ సామెత చంద్రబాబునాయుడు విషయంలో అచ్చంగా నిజమే అనిపిస్తోంది. దానికి తగినట్లుగానే చంద్రబాబునాయుడు వాస్తవాలు చెప్పే సరికి విపరీతమైన అసహనానికి గురయ్యారు. ప్రజల ఎదురుగా బహిరంగ సభ వేదిక మీద ఉన్నాననే సంగతిని కూడా మరచిపోయి.. ఆయన కట్టలు తెంచుకున్న తన అసహనాన్ని , కడప ఎంపి అవినాష్ రెడ్డి మీద ప్రదర్శించారు. ఒక్కసారిగా రెచ్చిపోయి ప్రోటోకాల్ మర్యాదలు కూడా పాటించకుండా.. ఎంపీ కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా.. అడ్డుకున్నారు. చంద్రబాబునాయుడు తన సహజమైన శైలిలో.. దబాయిస్తే చాలు ఎదుటి వారు నోరు మూయించేయవచ్చు అనే దోరణిలో చెలరేగిపోవడం చూసి జనం విస్తుపోయారు. వాస్తవాలు జనానికి తెలియవా? అలాంటి నిజాలు చెబుతోంటే.. చంద్రబాబు ముళ్లమీద కూర్చున్నట్లుగా అలా రెచ్చిపోవడం ఎందుకు అంటూ జనం తమలో తాము చర్చించుకున్నారు.

కడప జిల్లా పులివెందులలో జరిగిన జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది. పులివెందుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ కుచెందిన ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రోటోకాల్ కనీస ధర్మం గనుక.. ఆయనను అనుమతించారు. అయితే ఆయన ప్రసంగించడానికి పూనుకున్నప్పుడు.. మైకు ఇవ్వడానికి తొలుత నిరాకరించారు. కానీ.. ప్రోటోకాల్ ఉన్నందువల్ల ఆయనకు మైక్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్రావతి , గండికోట ప్రాజెక్టుల పనులు 85 శాతం వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని, 15 శాతం పనులు మాత్రం తెదేపా చేసిందని చెబుతూ ఉండగా.. చంద్రబాబునాయుడు ఒక్కసారిగా రెచ్చిపోయారు.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడవద్దంటూ.. అవినాష్ రెడ్డిపై ఆగ్రహం వెలిబుచ్చారు. మీటింగును రాజకీయం చేస్తున్నారు.. ఇది ప్రభుత్వ కార్యక్రమం.. ఇలాంటివి ఉంటే.. మీ పార్టీ మీటింగుల్లో చెప్పుకోండి అని రెచ్చిపోయారు. పచ్చచొక్కాల అనుచరులు అవినాష్ చేతిలో మైకు లాక్కునే ప్రయత్నం చేయగా.. చంద్రబాబు వారించారు. ఈలోగా.. ఎంపీ అవినాష్ చేతిలో ఉన్న మైకుకు కనెక్షన్ కట్ చేసేశారు. చంద్రబాబు మాత్రం.. కడప జిల్లాకు నీళ్లు ఇచ్చిందే నేను.. నా సభకు వచ్చి.. మీ గొప్పలు చెప్పుకుంటాం అంటే ఎలా.. అంటూ అవినాష్ రెడ్డిపై రెచ్చిపోయారు. మైకు లేకపోయినా సరే.. సీఎంనే వాస్తవాలతో అవినాష్ నిలదీసే ప్రయత్నం చేయగా.. ఆయన ఏకపక్షంగా దబాయించి... మాట్లాడనివ్వకుండా చేశారు.

ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అంటే ఇదే కాబోలు అని.. వాస్తవాలు చెబితే చంద్రబాబు సహించలేరని జనం అనుకోవడం కనిపించింది.