Begin typing your search above and press return to search.

ఎన్నికైన వెంట‌నే మేయ‌ర్ కు ముఖ్య‌మంత్రి క్లాస్..!

By:  Tupaki Desk   |   12 Feb 2021 11:30 PM GMT
ఎన్నికైన వెంట‌నే మేయ‌ర్ కు ముఖ్య‌మంత్రి క్లాస్..!
X
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ముగిసింది. ఆనందాలు.. ఆవేద‌న‌లు.. నినాదాలు.. నిర్వేదాలు.. సంతృప్తులు.. అసంతృప్తులు.. అన్నీ ముగిశాయి. అయితే.. ఎన్నికైన త‌ర్వాత ఏం జ‌రిగింది? మేయర్, డిప్యూటీ మేయర్ ఏ తరహాలో పాలన సాగించనున్నారు? సీల్డు కవర్ లో వచ్చిన వారికి గులాబీ అధిష్టానం గీసిన లక్ష్మణ రేఖలేంటీ? అన్న‌ది మాత్రం చాలా మందికి తెలియదు. అయితే.. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఏకంగా ముఖ్య‌మంత్రి కేసీఆరే క్లాస్ తీసుకున్నార‌ట‌!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి.. సీనియ‌ర్ నేత‌ కేకే కుమార్తె అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. ఆమెకు మేయ‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌డానికి ఎన్నిర‌కాల కార‌ణాలు చూపెడుతున్న‌ప్ప‌టికీ.. కేవ‌లం గ‌తంలో కేకేకు ఇచ్చిన మాట ప్ర‌కార‌మే కేసీఆర్ అంగీక‌రించార‌నేది బ‌ల‌మైన వాద‌న‌. అంతేకాదు.. ఈ విష‌యంలో తండ్రీ కొడుకులు ఏక‌తాటిపై లేర‌నే గుస‌గుస కూడా వినిపిస్తోంది. విజ‌య‌ల‌క్ష్మికి మేయ‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌డానికి కేటీఆర్ సుముఖంగా లేర‌ట‌. అయిన‌ప్ప‌టికీ.. కేసీఆర్ ముందుప‌డి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌ట‌. దీంతో.. ఎలా న‌డుచుకోవాల‌నే విష‌య‌మై గీతోప‌దేశం చేశార‌ట సీఎం.

ఈ ప‌రిస్థితుల్లో విజయలక్ష్మి వ్య‌వ‌హార శైలి చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఆమె.. ఏద‌నుకుంటే అదే మాట్లాడేస్తార‌నే అభిప్రాయం చాలా మందిలో ఉంది. చాలా కాలం అమెరికాలో ఉండిరావ‌డం కూడా ఈ త‌ర‌హా వ్య‌క్తిత్వానికి కార‌ణం అంటున్నారు. ఇలాంటి శైలి రాజ‌కీయాల్లో ప‌నికి రాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అది కూడా.. మేయ‌ర్ ప‌ద‌విలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

వీటిని విజ‌య‌ల‌క్ష్మి బ్యాలెన్స్ చేయ‌లేరనే అభిప్రాయంలో కేటీఆర్ ఉన్న‌ట్టు స‌మాచారం. అందుకే.. ఆయ‌న అంగీక‌రించ‌లేదట‌. కానీ.. స్వ‌యంగా ప్ర‌గతి భ‌వ‌న్ కు వెళ్లిన కేకే.. కేసీఆర్ తో సుదీర్ఘంగా మాట్లాడి, త‌న‌కు ఇచ్చిన మాట‌ను గుర్తు చేసి ఎట్ట‌కేల‌కు కూతురికి ప‌ద‌వి సాధించారట‌.

అన్ని అభ్యంత‌రాల‌నూ ఖాత‌రు చేయ‌కుండా మేయ‌ర్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన సీఎం.. ఆమెతో ప్ర‌త్యేకంగా మాట్లాడిన‌ట్టు స‌మాచారం. మేయ‌ర్ కాబ‌ట్టి.. ఎలా మ‌సులుకోవాలి? ఏ విష‌యంలో స్పందించాలి? ఎంత వ‌ర‌కు స్పందించాలి? మీడియాతో ఎప్పుడు.. ఎంత మాట్లాడాలి? అనే విష‌యాల‌పై చాలా సేపు క్లాస్ ఇచ్చార‌ని తెలిసింది. ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడి స‌మ‌స్య‌లు తీసుకురావొద్ద‌ని చెప్పార‌ట కేసీఆర్‌.

ప్ర‌ధానంగా మీడియా, సోష‌ల్ మీడియా ప్ర‌స్తావ‌న తెచ్చార సీఎం. మాట జారితే ఎలాంటి ప‌రిణామాలు వ‌స్తాయో కూడా వివ‌రించి.. త‌స్మాత్ జాగ్ర‌త్త అని హెచ్చ‌రించార‌ట‌!కేకే కూతు‌రికి మేయ‌ర్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి.. కేసీఆర్ త‌న మాట నిల‌బెట్టుకున్నారు. మ‌రి, కేసీఆర్ గీసిన ల‌క్ష్మ‌ణ రేఖ దాట‌కుండా విజ‌య‌ల‌క్ష్మి కొన‌సాగుతారా..? ముందున్నది ఒకటీ రెండు కాదు.. ఐదు సంవ‌త్స‌రాలు మ‌రి! చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?