Begin typing your search above and press return to search.

సీఎం... సీఎం...ఆ హోరూ.. జోరూ...?

By:  Tupaki Desk   |   4 May 2022 11:30 AM GMT
సీఎం... సీఎం...ఆ హోరూ.. జోరూ...?
X
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఆ జోష్ చూశారు, ఆ జోరూ హోరూ చూసి ఎన్నాళ్ళు అయింది. అది కదా అసలైన సంబరం. అవును కానీ ఆ ఈ నినాదాలు చూస్తూంటే మార్పు ఏమైనా కనిపిస్తోందా. గాలి మారినట్లుగా అగుపిస్తోందా. ఏమో ఇది రాజకీయం. పైగా వాతావరణం ఎపుడూ ఒకలా ఉండదు. అందుకే ఈ హోరును చూస్తే ఏదో ధైర్యం ధీమా కనిపిస్తోంది. చాలా కాలానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రా జిల్లాల పర్యటన కోసం విశాఖ వచ్చారు.

ఎయిర్ పోర్టులో బాబు అడుగు పెడుతూనే వెల్లువలా తరలివచ్చిన క్యాడర్ ఎదురేగి ఘన స్వాగతం పలికింది. ఇక పసుపుదనంతో పరిసరాలు అన్నీ పరిమళించిపోయాయి.

బాబు ఎయిర్ పోర్టు నుంచి బయటకు రావడంతోనే అక్కడ కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు అందుకున్నారు. అదే పనిగా వారు చేస్తున్న ఆ స్లోగన్స్ తో బాబు ముఖం వికసించింది, ఆయన కారు బయటకు వచ్చి రెండు చేతులూ అలా గాలిలో ఊపుతూ నలు వైపులా కలియతిరుగుతూ మరీ క్యాడర్ ని ఉత్సాహపరచారు.

బాబుకు జై, టీడీపీ జిందాబాద్ ఇలాంటి నినాదాలతో విశాఖ ఎయిర్ పోర్టు దద్దరిల్లిపోయింది. చంద్రబాబు ఏడాది కాలం తరువాత విశాఖలో కాలు మోపుతూంతే క్యాడర్ ఆయనకు ఆహ్వానం పలికిన తీరు ఇది. దీంతో తెలుగు తమ్ముళ్ళు తెగ హుషారెత్తి ఉన్నారు అని అర్ధమవుతోంది. ఇంకా ఎన్నికలు రెండేళ్ళ వ్యవధిలో ఉండగానే సీఎం సీఎం అంటూ వారు చేసిన నినాదాలు చూస్తే టీడీపీ వరకూ ఒక ధీమా అయితే వచ్చిందనే అనుకోవాలి.

గతంలో బాబు వచ్చినప్పటికీ ఈసారి వచ్చినప్పటికీ ఇది గుణాత్మకైన మార్పు. అది టీడీపీలో కనిపిస్తున్న మార్పు. అంటే పార్టీ ఫైటింగ్ కి గట్టిగా ఉన్నామని సంకేతం పంపుతోంది. బాబును ముందున పెట్టి తాము ఫీల్డ్ లోకి దూకేస్తామని అంటోంది. ఒక విధంగా బాబు క్యాడర్ కి మంచి బూస్టర్ ఇచ్చారనుకోవాలి.

మరి ఈ సీఎం నినాదాలు నిజం కావాలీ అంటే బాబు డైరెక్షన్ లో క్యాడర్ దూకుడుగా ఇక మీదట సాగాల్సి ఉంది. మొత్తానికి టీడీపీకి జవం జీవం లాంటి కార్యకర్త మాత్రం ఎత్తిన జెండా దించను అంటున్నాడు. ఇది తెలుగుదేశానికి ఈ రోజుకు దక్కిన సగం విజయంగా చూడాల్సిందే మరి.