Begin typing your search above and press return to search.

వెళ్లేటప్పుడు ఆగని సీఎం కాన్వాయ్.. రిటర్న్ లో మాత్రం సొంతంగా ఆపిన కేసీఆర్

By:  Tupaki Desk   |   1 Nov 2020 8:10 AM GMT
వెళ్లేటప్పుడు ఆగని సీఎం కాన్వాయ్.. రిటర్న్ లో మాత్రం సొంతంగా ఆపిన కేసీఆర్
X
రోడ్డు మీద రాజసంగా దూసుకెళ్లే ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆగటం అంత తేలికైన విషయం కాదు. ఒక పర్యటనలో రెండుసార్లు ఆగటం చాలా అరుదైన విషయంగా చెప్పాలి. ఇలాంటివి సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతాయి. రైతు వేదికల్ని ప్రారంభించేందుకు వీలుగా శనివారం జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్.. తన తిరుగు ప్రయాణంలో కాన్వాయ్ ను రెండు చోట్ల ఆపిన వైనం ఆసక్తికరమని చెప్పక తప్పదు. ఇలాంటివి ఆయనకు మాత్రమే సాధ్యమేమో?

ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారన్న విషయంలో కేసీఆర్ అర్థం కాని ఫజిల్ గా ఉంటారు. నిఘా వర్గాల నుంచి వచ్చే నివేదికలు.. సన్నిహితుల నుంచి అందే ఫీడ్ బ్యాక్.. ఇతర మార్గాల నుంచి ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు తానుగా గ్రౌండ్ లో ఏం జరుగుతుందన్న విషయాన్ని స్వయంగా తెలుసుకునే ప్రయత్నం ఎప్పటికప్పడు చేస్తుంటారు. తాజాగా అలాంటి ప్రయత్నమే మరోసారి చేశారు.

రైతు వేదికను ప్రారంభించి తిరిగి ఫాంహౌస్ కు వెళుతున్న కేసీఆర్.. యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కల పల్లి బస్ స్టేజీ వద్ద కాసేపు తన కాన్వాయ్ ను ఆపారు. అక్కడే ఉన్న స్థానిక రైతులు ఇద్దరిని దగ్గరకు పిలిచారు. వారిద్దరితో పాటు.. అక్కడే గ్రామ సర్పంచ్ కూడా దగ్గరకు రమ్మన్నారు. దీంతో పరుగు పరుగున ముఖ్యమంత్రి వద్దకు వారు వచ్చారు. కొడకండ్లలో తాను చేసిన ప్రసంగాన్ని విన్నారా? అని ప్రశ్నించారు. విన్నట్లుగా చెప్పిన వారి మాటలకు స్పందిస్తూ.. మిషన్ భగీరధ నీళ్లు సక్రమంగా వస్తున్నాయా? అని అడిగారు. మంచిగానే వస్తున్నాయని చెప్పిన వారు.. భువనగిరి - గజ్వేల్ రోడ్డు గుంతలతో అధ్వానంగా తయారైందని ఆయనకు చెప్పారు.

దీనికి స్పందించిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే తానీ పనులకు నిధులు మంజూరు చేశానని.. త్వరలోనే రోడ్డు బాగు చేస్తారని బదులిచ్చారు. ఉదయం తాను రైతు వేదిక ప్రారంభోత్సవానికి వెళుతున్న సందర్భంగా వాసాలమర్రి రామాలయం వద్ద కొందరు ప్లకార్డులు పట్టుకొని సీఎం కాన్వాయ్ ను ఆపే ప్రయత్నం చేశారు. కానీ.. ఆగలేదు. కాన్వాయ్ ఆపే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. తన తిరుగు ప్రయాణంలో.. ఎక్కడైతే తన కాన్వాయ్ ను ఆపే ప్రయత్నం చేశారో.. అక్కడే ఆగారు సీఎం కేసీఆర్. అక్కడి స్థానికుల్ని పిలిచిన ఆయన.. ఉదయం తాను వెళుతున్నప్పుడు ఎందుకు ఆపే ప్రయత్నం చేశారని అడిగారు. రోడ్డు విస్తరణతో గుడికి.. బడికి నష్టం జరుగుతుందని అందుకే ఆపే ప్రయత్నం చేసినట్లు వారు చెప్పారు. వారి మాటల్ని విన్న సీఎం కేసీఆర్.. వారిని ఉద్దేశించి.. ‘రేపు ఈ సమస్యపై మాట్లాడుకుందాం. ఆదివారం ఉదయం ఫాంహౌస్ కు రండి’’ అని చెప్పారు. ఇలాంటి నాటకీయ పరిణామాలు సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు.