పంకజ ముండేకే ఫడ్నవీస్ సపోర్టు
By: Tupaki Desk | 26 Jun 2015 10:43 AM GMTమహారాష్ట్రలో మంత్రి పంకజ ముండేపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తమ ప్రభుత్వం అవినీతికి పూర్తిగా వ్యతిరేకమని, మహారాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండేపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి తగిన సాక్ష్యాధారాలను చూపిస్తే.. ఆమెపై విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే.. ఆమె అవినీతికి పాల్పడ్డారని తాము భావించడం లేదని చెప్పుకొచ్చారు.
గిరిజన విద్యార్ధులకు సరఫరా చేసే పుస్తకాలు, ఇతర సామాగ్రి కొనుగోలులో టెండర్లు పిలవకుండానే రూ. 206 కోట్ల అవినీతి జరిగినట్లు పంకజ ముండేపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఆమె ఆమోదం తెలిపిన 24 కాంట్రాక్టుల ద్వారా ఈ అవినీతికి పాల్పడ్డట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు పంకజ ముండేను ఇప్పటికే కోరారు.
ఇటీవల అహ్మద్ నగర్ జిల్లాలో పంపిణీ చేసిన పల్లిపట్టీలు నాసిరకంగా ఉన్నాయని, అవి విద్యార్ధులు తినడానికి యోగ్యంగా లేవని ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. దీనిపై మంత్రి స్పందించక పోవడంతో ఆమె అవినీతికి పాల్పడ్డారంటూ కథనాలు వచ్చాయి. మరోవైపు ఈ ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని పంకజముండే కూడా చెబుతున్నారు.
విచారణ జరిగితే పంకజముండే చిరుతిళ్ల బండారం నిజమో కాదో తేలిపోతుంది.