Begin typing your search above and press return to search.

ఒక్కొక్కరికి రూ.2వేలు, మృతులకి రూ.5 లక్షలు !

By:  Tupaki Desk   |   19 Nov 2021 11:32 AM GMT
ఒక్కొక్కరికి రూ.2వేలు, మృతులకి రూ.5 లక్షలు !
X
భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో జనజీవనాన్ని స్తంభింపజేశాయి. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది.

దీంతో నది పరీవాహక ప్రాంతంలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు, శేషమాంబాపురం, మందపల్లి గ్రామాలు మునిగాయి. చెయ్యేరు నది నుంచి నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లో వరద పోటెత్తింది. దీంతో నందలూరు పరీవాహక ప్రాంతంలోని మండపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో చెయ్యేరు వరదలో కొందరు కొట్టుకుపోయారు.

భారీ వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ ఐదు జిల్లాల్లో పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు.

వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. వీరు జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం జగన్‌కు నివేదిస్తారు.

వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజేశేఖర్‌,చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న,వైఎస్‌ఆర్‌ జిల్లాకు సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ కుమార్‌ ను నియమించారు.

ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించామని, వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టామన్నారు. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు.

ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చామన్నారు. ముఖ్యంగా తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు తెలపడంతో.. దీనిపై తగిన కార్యచరణసిద్ధం చేయాలని.. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలన్నారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని, మంచి భోజనం, తాగునీరు అందించాలని.. వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.వర్షాల కారణంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించాలన్నారు.

తిరుపతిలో మున్సిపాల్టీ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలన్నారు సీఎం జగన్. అవసరమైతే ఇతర మున్సిపాల్టీలనుంచి సిబ్బందిని తీసుకు వచ్చి ఆపరేషన్‌ చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఎక్కడెక్కడ పంట నష్టపోయిందీ వివరాలు తయారు చేయాలన్నారు.