Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్ 1000 రోజుల ప్ర‌యాణం

By:  Tupaki Desk   |   4 March 2022 6:45 AM GMT
సీఎం జ‌గ‌న్ 1000 రోజుల ప్ర‌యాణం
X
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌న‌యుడిగా రాజ‌కీయాల్లో అడుగుపెట్టి.. రాజ‌న్న పాల‌న నినాదంతో జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో భారీ విజ‌యం ద‌క్కించుకున్నారు. రాజ‌కీయాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి ఘోర ప‌రాజ‌యాన్ని రుచి చూపించారు. 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల‌కు గాను ఏకంగా 151 సీట్లు వైసీపీ గెలిచింది. బంప‌ర్ మెజార్టీతో జ‌గ‌న్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. తొలిసారి ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించి నేటికి 1000 రోజులు పూర్త‌యింది.

ఇప్ప‌టివ‌ర‌కూ త‌న రెండున్న‌రేళ్ల‌కు పైగా పాల‌న‌లో జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల‌పైనే పూర్తి దృష్టి సారించారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారినా.. అప్పులు చేయ‌నిదే కార్య‌కాల‌పాలు సాగ‌క‌పోయినా.. ప్ర‌జ‌ల‌కు మాత్రం సంక్షేమ ప‌థ‌కాల పేరుతో డ‌బ్బులు పంచుతున్నార‌ని జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి ప‌డ‌కేసింద‌ని.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నుల కోసం నిధులు కూడా లేవ‌ని ప్ర‌తిప‌క్షాలు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నాయి. కొన్ని సార్లు అధికార వైసీపీ నేత‌లే త‌మ అసంతృప్తిని బ‌హిరంగంగా వెళ్ల‌గ‌క్కిన విష‌యం తెలిసిందే. అయినా సంక్షేమ ప‌థ‌కాల‌నే న‌మ్ముకున్న జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవే త‌న‌ను మ‌రోసారి గెలిపిస్తాయ‌నే ధీమాతో ఉన్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

మ‌రోవైపు అధికారంలోకి రాగానే రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్ర‌క్రియ‌ను తీసుకువ‌చ్చిన జ‌గ‌న్ ప్రాజెక్టుల అంచ‌నా వ్య‌యాల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ మాట త‌ప్ప‌ను మ‌డ‌మ తిప్ప‌ను అని చెప్పిన జ‌గ‌న్‌.. మూడు రాజ‌ధానుల బిల్లు, మ‌ద్యపాన నిషేధం, శాస‌న మండ‌లి ర‌ద్దుపై వెన‌క్కి త‌గ్గార‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. తాజాగా అమ‌రావ‌తే రాజ‌ధాని అని కోర్టు ఇచ్చిన తీర్పు కూడా జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చేదే. మ‌రోవైపు టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు కూడా వైసీపీపై విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయి. ఇక ఇటీవ‌ల పీఆర్సీ ఉద్య‌మంలో భాగంగా ఉద్యోగుల చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మంతో ప్ర‌భుత్వం దిగి వ‌చ్చి వాళ్ల‌ను శాంతిప‌జేసిన విష‌యం విదిత‌మే.

రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం అన్యాయం చేస్తున్నా కేసుల‌కు భ‌య‌ప‌డి జ‌గ‌న్ నోరు మెద‌ప‌డం లేద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఆస్తుల‌న్నింటినీ అప్పుల కోసం త‌న‌ఖా పెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇలా పాల‌న‌ ప‌రంగా ఈ వెయ్యి రోజుల ప్ర‌యాణంలో జ‌గ‌న్ ఒడుదొడుకులు ఎదుర్కొన్న‌ప్పటికీ పార్టీ ప‌రంగా మాత్రం వైసీపీకి తిరుగులేదు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిన‌ప్ప‌టి నుంచి రాష్ట్రంలో జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీనే విజ‌య ఢంకా మోగించింది. స‌ర్పంచ్‌, మున్సిపాలిటీలు, మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లు.. ఇలా ఏ ఎన్నికైనా వైసీపీకే సంపూర్ణ మెజారిటీ ద‌క్కింది. ముఖ్యంగా చంద్ర‌బాబు కంచుకోట కుప్పాన్ని కూల‌గొట్టే దిశ‌గా వైసీపీ క‌దులుతోంది.