Begin typing your search above and press return to search.

గ‌డ‌ప ఏం చెప్పింది..? సీఎం ఆరా!

By:  Tupaki Desk   |   8 Jun 2022 10:30 AM GMT
గ‌డ‌ప ఏం చెప్పింది..? సీఎం ఆరా!
X
కొంద‌రు పాస్ కొంద‌రు ఫెయిల్..ఇది గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం నిర్వ‌హ‌ణ‌లో చోటుచేసుకున్న ప‌రిణామం. కొంద‌రు సీనియ‌ర్లు జ‌నం బాధ‌లు అర్థం చేసుకుంటే, ఇంకొంద‌రు జూనియ‌ర్లు సొంత పార్టీ మ‌నుషుల‌పైనే రెచ్చిపోయి రంకెలు వేశారు.

దీంతో ఈ కార్య‌క్ర‌మం మిశ్ర‌మ ఫ‌లితం అందుకుంటూ ముందుకు సాగుతోంది. అవంతి లాంటి లీడ‌ర్లు నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడితే మేలు అన్న భావ‌న కూడా సీఎం వర‌కూ వెళ్లింది. అదేవిధంగా కొంద‌రు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించి గొడ‌వ‌లు రాకుండా స‌రిదిద్దిన వైనం కూడా ఉంది. రోజా లాంటి లీడ‌ర్లు న‌వ్వుతూ స‌మాధానాలు చెప్పి గ‌ట్టెక్కేస్తే, అవంతి లాంటి లీడ‌ర్లు మాత్రం నోరేసుకుప‌డిపోయార‌న్న వాద‌న‌లు ఉన్నాయి.

పేర్నినాని, కొడాల‌ని నాని గ‌డ‌ప గ‌డ‌ప‌కూ కార్య‌క్ర‌మంలో ఉన్నారో లేరో కూడా తెలియ‌కుండానే ఉంది. వారి ఊసు మాత్రం పెద్ద‌గా ఎక్క‌డా విన‌ప‌డ లేదు. అంద‌రి క‌న్నా ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ పిరియా సాయిరాజ్ మాత్రం కాళ్ల‌కు బ‌లపం క‌ట్టుకుని మ‌రీ తిరుగుతున్నారు. స్థానికంగా ఉన్న నేత‌లతో విభేదాలున్నా వారంద‌రినీ వెంటబెట్టుకునే తిరుగుతున్నారు. ఇవి కూడా సీఎం దృష్టికి వెళ్లాయ‌ని టాక్. సో.. ఇవాళ అమ‌రావ‌తి కేంద్రంగా జ‌రిగే స‌మీక్ష‌లో మ‌రికొన్ని విష‌యాల‌పై సీఎం గైడెన్స్ ఇవ్వ‌నున్నారు...

ఇవాళ గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి సంబంధించి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మీక్షించ‌నున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ నాయ‌కులు,రీజ‌న‌ల్ ఇంఛార్జులు, మంత్రుల‌తో ఆయ‌న స‌మీక్ష జ‌ర‌ప‌నున్నారు. ముఖ్యంగా పార్టీ కి సంబంధించి, ప్ర‌భుత్వానికి సంబంధించి ఇది ముఖ్య‌మ‌యిన కార్య‌క్ర‌మం కావ‌డంతో వైఎస్ జ‌గ‌న్ మొద‌ట్నుంచి దీనిని విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌న్న త‌లంపులో ఉన్నారు. వివాదాలున్నా స‌రే, ఆక్షేప‌ణ‌లు వ‌చ్చినా స‌రే.. వీలున్నంత వ‌ర‌కూ సామ‌ర‌స్య పూర్వ‌క ధోర‌ణిలోనే వెళ్లాల‌ని యోచిస్తున్నారు. ఇదే మాట ఎమ్మెల్యేల‌కూ సూచిస్తున్నారు. త్వ‌ర‌లోనే ముఖ్య‌మంత్రి జిల్లాల ప‌ర్య‌ట‌న కూడా ఉండ‌డంతో ముందుగా జ‌నంలోకి వెళ్లిన మంత్రులు ఏం నేర్చుకున్నారు.. ఏం తెలుసుకున్నారు అన్న‌వి గుర్తించ‌నున్నారు. ఇదే ఇవాళ స‌మీక్ష‌లో కీల‌కం కానుంది. అటుపై కీల‌క నాయ‌కుల‌కు ఓరియెంటేష‌న్ క్లాస్ ఇవ్వ‌నున్నారు అని కూడా సమాచారం.

వాస్త‌వానికి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కువ చేదు అనుభ‌వాలే అందుకున్నారు. అయినా స‌రే నాయ‌కులు జ‌నం ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌కుండా కాల‌యాప‌న చేయ‌డం వ‌ల్ల చిన్న‌,చిన్న స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం కావ‌డం లేదు అని జ‌గ‌న్ భావించి, మంత్రుల‌ను, ముఖ్య నేత‌ల‌నూ ఏక కాలంలో ఫీల్డ్ లో ఉంచారు. ముఖ్యంగా స‌మ‌స్య‌లు గుర్తించ‌డ‌మే కాదు వాటి ప‌రిష్కారం కోసం నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్ర‌జాప్ర‌తినిధులు ఏం చేశారు అన్న‌ది కూడా ఇవాళ తెలుసుకోనున్నారు.

వివాదాల‌పై ఆరా ?

ఇప్ప‌టిదాకా ప‌లు చోట్ల వివాదాలు వ‌చ్చాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఫీల్డ్ లో వీరి నెల రోజుల ప‌నితీరు ఎలా ఉంద‌న్న విష‌య‌మై జ‌గ‌న్ ఇప్ప‌టికే నివేదిక‌లు తెప్పించుకున్నారు. కొన్ని చోట్లమంత్రులు సంయ‌మ‌నంతో నే ఉన్నా, కొన్ని చోట్ల కార్య‌క‌ర్త‌ల‌పై కూడా ఆగ్ర‌హంతో ఊగిపోయారు.

కొన్ని చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు తెలివిగా వివాదాస్ప‌ద ప్రాంతాల జోలికి పోకుండా వ‌లంటీర్లు ఎంపిక చేసిన ఇళ్ల‌కే వెళ్లి తిరిగి వ‌చ్చారు. ముఖ్యంగా అవంతి లాంటి లీడ‌ర్లు ఫీల్డ్ లో చేదు అనుభ‌వాలే అందుకున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన‌ప్ప‌ల‌నాయుడు లాంటి వారు పింఛ‌ను విష‌యంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి అధిష్టానానికి కొత్త త‌ల‌నొప్పులు తెచ్చారు. అదేవిధంగా కొన్ని చోట్ల రోడ్ల విష‌య‌మై, పారిశుద్ధ్య‌నిర్వ‌హ‌ణ పై కూడా వినతులు వ‌చ్చాయి. వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఇవాళ రివ్యూలో సీఎం కొన్ని సూచ‌న‌లు చేయ‌నున్నారు.