Begin typing your search above and press return to search.

జగన్ - చంద్రబాబు ఇద్దరూ నెల్లూరులోనే

By:  Tupaki Desk   |   15 Oct 2019 7:42 AM GMT
జగన్ - చంద్రబాబు ఇద్దరూ నెల్లూరులోనే
X
ఏపీ సీఎం జగన్ - విపక్ష నేత చంద్రబాబునాయుడు ఇద్దరూ ఈరోజు నెల్లూరు జిల్లాలోనే పర్యటిస్తున్నారు. సాధారణంగా ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉండడమనేది అరుదుగా చోటుచేసుకుంటుంది. కేవలం రాజధానిలో మాత్రమే ఎక్కువగా అలాంటి సందర్భం ఏర్పడుతుంది కానీ - రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇద్దరూ ఒకేసారి పర్యటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇద్దరికీ మిత్రులైన నేతల ఇళ్లలో వివాహాలు - చావులు వంటివి ఉన్నప్పుడు కూడా ఇద్దరూ ఒకే చోటికి వెళ్లడం జరుగుతుంటుంది. కానీ - ఇప్పుడు అలాంటిదేమీ లేకుండానే అనుకోకుండా సీఎం జగన్ - విపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ నెల్లూరు వెళ్లడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం గన్నవరం నుండి ప్రత్యక విమానంలో బయలుదేరి ఉదయం 10.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుండి హెలికాప్టర్ లో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం - కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీకి చేరుకుంటారు. అక్కడ జరిగే రైతుభరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు.

మరోవైపు చంద్రబాబు ఇప్పటికే నెల్లూరులో ఉన్నారు. ఆ జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో ఆయన సమావేశమవుతున్నారు. నిన్న సోమవారం ఐదు నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు ఇవాళ మిగిలిన ఐదు నియోజకవర్గాల నేతలు - కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం గొలగముడి వెంకయ్య స్వామిని దర్శించుకొనున్న చంద్రబాబు అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్తారు.

ఒకే రోజు సీఎం - మాజీ సీఎంలు జిల్లాలో ఉండడంతో నెల్లూరు నగరం మొత్తం పోలీసు బందోబస్తే కనిపిస్తోంది. ఇద్దరి కార్యక్రమాలు సుమారు 15 కిలోమీటర్ల దూరంలోనే జరుగుతుండడంతో రెండు పార్టీల నాయకుల హడావుడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.