Begin typing your search above and press return to search.

జగన్ కి జై కొడుతున్న తమిళవాసులు !

By:  Tupaki Desk   |   21 Jun 2020 11:15 AM IST
జగన్ కి జై కొడుతున్న తమిళవాసులు !
X
తమిళనాడులోని మధురై జిల్లాలో కోలీవుడ్ నటుడు విజయ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బ్యానర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అతడి బ్యానర్లను పెట్టారు ఫ్యాన్స్ . అందులో కొన్ని చోట్ల విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు తమ కోరికను బయటపెట్టారు. అసలు విజయ్ కి , సీఎం జగన్ కి సంబంధం ఏంటి ?

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో రజనీకాంత్‌ తరువాత అంతటి ఫాలోయింగ్‌ కలిగిన నటుడు విజయ్‌. విజయ్‌ రాజకీయాల్లోకి రావాలని ఆయన తండ్రి, సీనియర్‌ దర్శకులు ఎస్‌ఏ చంద్రశేఖర్ ‌తోపాటూ అభిమానులు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వ పథకాలను దుయ్యబడుతూ 2018లో ఆయన నటించిన సర్కార్‌ అనే చిత్రం రాజకీయ వర్గాల్లో కలకలానికి దారి తీసింది. తమిళనాడులో వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్రమంలో ఆంధ్ర సీఎం జగన్‌ లా ప్రజల కష్టాలు తీర్చే ప్రభుత్వాన్ని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ లా అవినీతిరహిత పాలనని, కేరళ సీఎం పినరై విజయన్ ‌లా నిజాయితీతో ప్రభుత్వ పాలన చేయడానికి రావాలంటూ అభిమానులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే గతంలోనూ విజయ్, జగన్ కలిసి ఉన్న పోస్టర్లు తమిళనాట వైరల్ ‌గా మారాయి. వైపు జగన్, ఈ వైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మధ్యలో విజయ్ ఉన్న ఫొటోలను పెట్టిన అభిమానులు.. అతడు రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించిన విషయం తెలిసిందే. కుంభకోణం విజయ్‌ మక్కల్‌ ఇయక్కం తరఫున అతికించిన ఈ పోస్టర్లలో రేపటి ప్రభుత్వాన్ని నిర్ణయించనున్న ‘సర్కార్‌’ అనే నినాదాన్ని సైతం ఆ పోస్టర్లలో పొందుపరిచారు. మధురైలోనూ ఇలాంటి పోస్టర్లు వెలిశాయి.