Begin typing your search above and press return to search.

వీర జవాన్ల కుటుంబాలకు సీఎం జగన్ హామీ భారీ ఆర్థిక సాయం!

By:  Tupaki Desk   |   5 April 2021 12:05 PM GMT
వీర జవాన్ల కుటుంబాలకు సీఎం జగన్ హామీ భారీ ఆర్థిక సాయం!
X
చత్తీస్‌ గఢ్‌ ఘటనలో జవాన్ల మృతిపట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికి‌ చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలిపారు. ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామని, భారీ పరిహారాన్ని ప్రకటించారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో రూ.30లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని వెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. అలాగే ఆ జవాన్ల కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం తరుపన అన్నిరకాలుగా ఆదుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్ ‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో మొత్తం 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన రౌతు జగదీష్, గుంటూరు జిల్లాకు చెందిన మురళీ కృష్ణ అన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీష్‌ ది మక్కువ మండలం కంచేడువలస గ్రామం. రౌతు జగదీష్ కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగలో నివసిస్తోంది. డిగ్రీ వరకు చదువుకున్న జగదీష్‌ 2010లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ గా ఎంపికయ్యాడు. జగదీష్ ‌కు వచ్చే నెల 22న పెళ్లి నిశ్చమైంది. ఆ పెళ్లికోసం మరో వారం రోజుల్లో సెలవుపై రావలసి ఉంది. ఇటువంటి సమయంలో జగదీష్ మరణవార్త కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

ఇదే ఘటనలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌ పీఎఫ్‌ కోబ్రా కమాండర్‌ శాఖమూరి మురళీకృష్ణ మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. శాఖమూరి రవి, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు వెంకటమోహన్‌ కాగా, చిన్నకుమారుడు మురళీకృష్ణ, మురళీకృష్ణ 2010లో సీఆర్ ‌పీఎఫ్ కు ఎంపికయ్యాడు. మురళీ కృష్ణకు త్వరలోనే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఇటీవలే కొత్త ఇల్లు నిర్మించారు. ఈ వేసవిలో వివాహం జరిపించేందుకు కుటుంబసభ్యులు సంబంధాలు చూస్తున్నారు. రెండు నెలల క్రితం సెలవుపై ఇంటికి వచ్చిన మురళీ కృష్ణ ఈసారి పెళ్లి చేసుకునేందుకు వస్తానని స్నేహితులు, బంధువులకు చెప్పి వెళ్లాడు. ఇంతలోనే మురళీకృష్ణ వీరమరణం పొందడం అందర్నీ షాక్ కి గురిచేసింది.