Begin typing your search above and press return to search.

వైసీపీ నేతలతో సీఎం జగన్‌ కీలక భేటీ అందుకేనా?

By:  Tupaki Desk   |   8 Dec 2022 7:30 AM GMT
వైసీపీ నేతలతో సీఎం జగన్‌ కీలక భేటీ అందుకేనా?
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే పలుమార్లు పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు తమ నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ మూడున్నరేళ్లలో కలిగిన లభ్దిని వివరించి వచ్చే ఎన్నికల్లోనూ తమకే ఓటేయాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమీక్షించడంతోపాటు వచ్చే ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి వైసీపీ అధినేత జగన్‌ డిసెంబర్‌ 8న కీలక భేటీ నిర్వహిస్తున్నారు. 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్‌లతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు.

ఇటీవలే అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల పనితీరు, కిందిస్థాయి కార్యకర్తలు అభిప్రాయాలను అబ్జర్వర్ల ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 8న గురువారం నిర్వహించే సమావేశంలో పార్టీలో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం పరిశీలకులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశంలో జగన్‌ ముఖ్యంగా కొన్ని అంశాలను ప్రస్తావిస్తారని చెబుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సరిగా నిర్వహించడం లేదని రిపోర్టులు జగన్‌ దగ్గర ఉన్నాయని సమాచారం. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్యే తీవ్ర విభేదాలు ఉన్నాయని అంటున్నారు. వీరు తమ పనితీరును, వ్యవహారశైలిని మార్చుకోకపోతే సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదని జగన్‌ మరోమారు చెబుతారని అంటున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సరిగా చేయనివారికి సీట్లు ఇవ్వబోనని పలుమార్లు జగన్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం మందకొడిగా సాగుతోందని సమాచారం.

అలాగే అసమ్మతి రాజకీయాలతో, విభేదాలతో పార్టీ పరువును బజారున పడేస్తున్న నేతలకు కూడా సీఎం జగన్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. తనకు పార్టీనే ముఖ్యమని.. పార్టీ కోసం ఎంత పెద్ద నేతనైనా తాను వదులుకోవడానికి సిద్ధమని జగన్‌ కుండబద్దలు కొట్టబోతున్నట్టు చెబుతున్నారు.

అదేవిధంగా ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, వచ్చే కాలంలో చేపట్టనున్న కొత్త పథకాలు, అభివృధ్ధి కార్యక్రమాల గురించి కూడా జగన్‌ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారని టాక్‌ నడుస్తోంది. ముఖ్యంగా పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం పెంచేలా పలు సూచనలు చేస్తారని తెలుస్తోంది.

పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించే సమావేశంలో వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది ఎవరికో సీఎం జగన్‌ ప్రకటించనున్నారని అంటున్నారు. అంచనాలు అందుకోనివారికి ఫైనల్‌ హెచ్చరిక జారీ చేస్తారని.. వీరు మారకపోతే వీరి స్థానాల్లో ఇప్పటికే నియమించిన అబ్జర్వర్లు (పరిశీలకులు) చివరి క్షణంలో ఎన్నికల్లో పోటీ చేసే వీలుందని అంటున్నారు.

డిసెంబర్‌ 7న నిర్వహించిన జయహో బీసీ సభ విజయవంతం కావడం పట్ల జగన్‌ ఆనందంగా ఉన్నారని చెబుతున్నారు. ఇక ఎన్నికల వరకు ఈ వేడిని తగ్గకుండా కొనసాగించాలని కోరుకుంటున్నారు.

ఇందుకోసం నియోజకవర్గాల వారీగా పార్టీ – ప్రభుత్వ వ్యవహారాలపై తాజాగా నియమితులైన కో ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు నివేదికలు పంపేలా కొత్త ఫార్మాట్‌ సిద్ధం చేశారని చెబుతున్నారు.

కాగా ప్రశాంత్‌ కిశోర్‌ సర్వేలు, తాను సొంతంగా చేయించుకున్న సర్వేల్లో దాదాపుగా 36 మంది ఎమ్మెల్యేల పని తీరు బాలేదని సీఎం అంచనా కొచ్చినట్టు చెబుతున్నారు. ఈ 36 స్థానాల్లో పార్టీ గెలవడం కష్టమేనని తేలినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ 36 చోట్ల సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకుంటారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

అలాగే నియోజకవర్గాల వారీగా ప్రతి 50 ఇళ్లకు ఇప్పుడు వలంటీర్లు ఉన్నట్టే పార్టీ తరఫున కూడా ప్రతి 50 ఇళ్లకు ఒక ప్రతినిధిని నియమిస్తారని తెలుస్తోంది. జయహో బీసీ సభలో ఈ మేరకు సీఎం జగన్‌ స్పష్టతనివ్వడం గమనార్హం. గ్రామాల నుంచి నగరాల వరకు బూత్‌ లెవల్‌లో పార్టీ కమిటీల్లో అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే సీఎం జగన్‌ ఆదేశించారు. అలాగే ప్రతి 50 ఇళ్లకు ఒక ప్రతినిధిని నియమించి అనుక్షణం పార్టీ పరిస్థితిని అంచనా వేయాలని జగన్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.