Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ను గుర్తు చేసేలా జగన్ నిర్ణయం ఉండనుందా?

By:  Tupaki Desk   |   14 Aug 2021 11:30 AM GMT
ఎన్టీఆర్ ను గుర్తు చేసేలా జగన్ నిర్ణయం ఉండనుందా?
X
పుట్టిన క్షణంలోనే మరణం గురించి తెలిస్తే ఎలా ఉంటుంది. కాకుంటే కండిషన్లు అప్లై అన్న ఊరట చిన్నమాట వినిపించినా.. ప్రాణం పోసినోడి చేతుల్లోనే ప్రాణం పోవటం ఖాయమన్న సత్యం మాత్రం క్లియర్ గా తెలుస్తుంటుంది. సమకాలీన రాజకీయాల్లో ఎప్పుడూ చూడని.. వినని రీతిలో మంత్రిపదవుల్లోకి తీసుకున్న రోజునే వారి పదవులు ఊడేది ఎప్పుడన్న విషయం మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలనంగా మారటం తెలిసిందే. చారిత్రక గెలుపు తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి.. కొన్ని కండిషన్లు పెట్టి.. వాటిల్లో ఏ మాత్రం తేడా వచ్చినా రెండున్నరేళ్ల తర్వాత 2024 ఎన్నికల టీం ఒకటి ఏర్పాటు చేస్తానని స్పష్టంగా చెప్పటం తెలిసిందే.

మంత్రి పదవులు దక్కిన వారిలో తమ పని తీరుతో తమను తాము నిరూపించుకోవాలని.. ఆ విషయంలో తేడా వస్తే వేటు ఖాయమని చెప్పిన జగన్.. అందుకు తగ్గట్లే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తాను చెప్పినట్లే రెండున్నరేళ్లు గడిచిపోతున్న వేళలో.. మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు కసరత్తులు మొదలైనట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే రానున్న దసరాకు సొంత పార్టీ నేతలకు భారీ షాకిచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో 25మంది మంత్రులు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో ఎందరి పదవులు ఉంటాయా? అందరికి ఊస్ట్ అవుతాయన్న దానిపై మాత్రం పార్టీ కీలక నేతల తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. మంత్రివర్గంపై అసహనానికి గురై.. ఒక్క కలం పోటుతో మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేసేసి.. ఫ్రెష్ గా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. అలాంటి నిర్ణయం జగన్ తీసుకునే అవకాశం ఉండదంటున్నారు. దీనికి కారణం.. మంత్రివర్గంలో ఆయనకు అత్యంత సన్నిహితులు.. అపర విధేయులు కొందరు ఉన్నారని.. అందుకే అందరిపై వేటు వేసే అవకాశం లేదంటున్నారు.

ఎక్కువమంది నేతల అభిప్రాయం ప్రకారం పాతిక మంది మంత్రుల్లో 18 మందిని మార్చటానికి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు. కొత్తగా కాబినెట్ లో తీసుకునే వారంతా కూడా.. ఉద్వాసనకు గురైన సామాజిక వర్గాలకు చెందిన ఇతర నేతలకు పదవులు దక్కే అవకాశం ఉందంటున్నారు. జిల్లాలు.. సామాజిక వర్గాల విషయంలో డిస్ట్రబ్ చేయరంటున్నారు. మంత్రివర్గాన్ని చూసినప్పుడు రెడ్లకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వని జగన్.. పవర్ ఫుల్ పోస్టుల్లో మాత్రం రెడ్లకే అవకాశం ఇచ్చారు. చూసినంతనే మంత్రుల్లో రెడ్ల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే.. పాలనా రథంలో కీలకభూమిక రెడ్లకు ఉందన్నది మర్చిపోకూడదు.

ఇక. మధ్యలో మంత్రివర్గంలోకి తీసుకున్న సీదరి అప్పలరాజు.. చెల్లుబోయిన గోపాల క్రిష్ణలకు మాత్రం పదవీ గండం ఉండదన్న మాట వినిపిస్తోంది. ఏరి కోరి తీసుకోవటం.. వారి విషయంలో జగన్ సంతోషంగానే ఉన్నట్లు చెబుతున్నారు. వారిద్దరూ రాజ్యసభ సభ్యులుగా వెళ్లిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణ స్థానంలో తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తంగా చూస్తే.. దసరాకు ఏపీ కాబినెట్ ప్రక్షాళన ఖాయమని.. పద్దెనిమిది మందికి పదవీ గండం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అనుకోనిది ఏదైనా జరిగితే ఒకట్రెండు తేడా రావొచ్చేమో కానీ.. ప్రక్షాళన మాత్రం ఖాయమంటున్నారు.