Begin typing your search above and press return to search.

డీబీటీకి కొత్త అర్ధం చెప్పిన సీఎం జ‌గ‌న్‌... బాబుపై ఫైర్‌

By:  Tupaki Desk   |   29 July 2022 12:00 PM GMT
డీబీటీకి కొత్త అర్ధం చెప్పిన సీఎం జ‌గ‌న్‌... బాబుపై ఫైర్‌
X
డీబీటీ అంటే.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ విధానం కింద వివిధ ప‌థ‌కాల‌కు సంబంధించి.. ల‌బ్ధి దారుల ఖాతాల్లో నిధులు జ‌మ చేస్తుంటాయి. అయితే.. ఈ డీబీటీకి ఏపీ సీఎం జ‌గ‌న్ కొత్త అర్ధం చెప్పారు. డీబీటీ ద్వారా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ పథకాల నిధుల్ని.. లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా కాకినాడ గొల్లప్రోలు సభ నుంచి లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న డీబీటికి.. కొత్త అర్ధం చెప్పారు. త‌న ప్ర‌భుత్వంలో మాదిరిగానే చంద్రబాబు పాలన లో కూడా డీపీటీ సమర్థవంతంగా అమలు అయ్యిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అదేంటి అనుకుంటు న్నారా? ఇక్క‌డే ఉంది లాజిక్కు..?

చంద్రబాబు పాలనలో ‘డీపీటీ’ అంటే.. `దోచుకో.. పంచుకో.. తినుకో` అని సీఎం జగన్‌ నిర్వచించారు. డీపీటీ ద్వారా దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీరికి తోడు దత్తపుత్రుడు అంతా కలిసి సామాజిక న్యాయం పాటించారని ఎద్దేవా చేశారు. కాపుల ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు అమ్మడానికి దత్త పుత్రుడు ప్రయత్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

``మన ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం కావాలా? చంద్రబాబు హయాంలో ఉన్న దోచుకో, పంచుకో, తినుకో కావాలా?..`` అని ప్రజలను ఉద్దేశించి జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. చంద్రబాబు, పవన్‌, ఎల్లోమీడియాకు తెలిసింది అవినీతి మాత్రమేన‌న్నారు.

``చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. హుద్‌హుద్‌ వచ్చినప్పుడు 11 రోజుల పాటు నేనే స్వ యంగా ఉత్తరాంధ్రలో తిరిగా. ఆ సమయంలో పాచిపోయిన పులిహోర ప్యాకెట్లను బాధితులకు పంచాడు ఆయన. కానీ, మా హయాంలో విపత్తు వస్తే బాధితులను సక్రమంగా ఆదుకుంటున్నాం`` అని జ‌గ‌న్ అన్నారు.

వరద బాధితులు ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా రేషన్‌తో పాటు ప్రతీ ఇంటికి రూ.2 వేలు ఇస్తున్నామ‌ని జ‌గ‌న్ చెప్పారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేకపోయారని, అలాగే.. జగనన్న పాలనలో లబ్ధి జరగలేదని చంద్రబాబు ఏ ఒక్కరినీ చూపలేకపోయారని అన్నారు. అబద్దాల మార్క్‌ చంద్రబాబు కావాలా? ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వం కావాలా?.. ఎవరి పాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాల‌ని సీఎం జగన్‌ పిలుపు ఇచ్చారు.