Begin typing your search above and press return to search.

ఏపీలో మరోసారి వాయిదా పడ్డ ఇళ్ల పట్టాల పంపిణీ..కొత్త ముహూర్తం ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   20 March 2020 1:30 PM GMT
ఏపీలో మరోసారి వాయిదా పడ్డ ఇళ్ల పట్టాల పంపిణీ..కొత్త ముహూర్తం ఎప్పుడంటే?
X
వైసీపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలు చేయాలని చూస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలతో ఈ కార్యక్రమం వాయిదా వేశారు. అయితే , దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ తరుణంలో ఎన్నికలు జరపడం మంచిది కాదు అని భావించి ఈసీ స్థానిక ఎన్నికలని వాయిదా వేయడంతో .. ఉగాది రోజున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని వైసీపీ ప్రభుత్వం భావించింది.

కానీ , మరోసారి ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఈసారి కరోనా ప్రభావం పడింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై , జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే , రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కరోనా వైరస్ రోజురోజుకి తీవ్ర తరం అవుతున్న నేపథ్యంలో ..భారీ భహిరంగ సభ నిర్వహించడం మంచిది కాదు అని భావించి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.లబ్ధిదారులు అందరికీ ఒకేసారి కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకొని వారికి ఇళ్ల సైట్లను చూపించాలని ఆయన అధికారులకు సూచించారు.