Begin typing your search above and press return to search.

వారికి శుభవార్త చెప్పిన సీఎం జగన్ .. జీతాలు పెంపు ?

By:  Tupaki Desk   |   27 Sept 2021 6:40 PM IST
వారికి శుభవార్త చెప్పిన సీఎం జగన్ .. జీతాలు పెంపు ?
X
ఏపీ లో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్చకులకు 25 శాతం జీతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖ పై సీఎం సమగ్ర రీతిలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అర్చకుల సమస్యలపై దృష్టి సారించారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం చేపడుతున్నట్టు వెల్లడించారు.

ఏపీ సర్కారు గత వేసవిలోనూ అర్చకుల జీతాన్ని పెంచిన సంగతి తెలిసిందే. కేటగిరి-1 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచారు. కేటగిరీ-2 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇప్పుడు మరోసారి వారి వేతనాన్ని పెంచుతూ రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తాజాగా దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్చకులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే ఆలయాల్లో టికెట్ల జారీకి ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తే.. ఎక్కడా కూడా అవినీతికి చోటు ఉండదని సీఎం జగన్ స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తోన్న మంచి విధానాలను ఇతర దేవాలయాల్లోనూ ప్రవేశపెట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఉత్తమ నిర్వహణా పద్దతులను అమలులోకి తీసుకురావాలని, ఆన్‌ లైన్ విధానం నుంచి నాణ్యమైన ప్రసాదాల తయారీ వరకూ టీటీడీ విధానాలను పాటించాలన్నారు.

ఎక్కడా కూడా అవినీతికి చోటు లేకుండా ఆన్‌ లైన్ పద్దతులను కొనసాగించాలన్నారు. దాతలు ఎవరైనా కూడా ఆన్‌ లైన్ ద్వారా విరాళాలను ఇవొచ్చునని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆన్లైన్‌ పద్ధతులను, విధానాలను తెలియజేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద బోర్డులను పెట్టాలన్నారు. అలాగే దాతలు ఇచ్చిన విరాళాలను ఆలయాల అభివృద్ధికి వాడుకోవాలని, పక్కదోవ పట్టకుండా నేరుగా దేవాలయాలకు ఉపయోగపడాలని అధికారులకు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు దేవాలయ భూముల పరిరక్షణలో భాగంగా ప్రతీ జిల్లాకు కలెక్టర్, ఎస్పీ, ఒక ప్రభుత్వ న్యాయవాదితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. దేవాలయ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే చేసి, వాటిని జియో ట్యాగింగ్‌ చేయాలని ఆదేశించారు. సమగ్ర భూ సర్వేలో దేవాలయ భూములకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని సుమారు 18 వేల ఆలయాల్లో భద్రత కోసం సుమారు 47 వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా ఎక్కడ ఆలయాలు ఉన్నా, వాటి భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.