Begin typing your search above and press return to search.

మ‌ధ్య‌త‌ర‌గ‌తికి జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్ షిప్.. సంక్రాంతికి శ్రీకారం!?

By:  Tupaki Desk   |   7 Jan 2022 8:30 AM GMT
మ‌ధ్య‌త‌ర‌గ‌తికి జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్ షిప్.. సంక్రాంతికి శ్రీకారం!?
X
ఏపీ సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు పేద‌ల‌కు 30 ల‌క్ష‌ల ఇళ్ల ప‌ట్టాల‌ను మంజూరు చేశారు. న‌గ‌రాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్న‌ర చొప్పున ఆయ‌న పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను మంజూరు చేశారు. ఇక‌, వీటిలో ఇళ్ల నిర్మాణం.. చేప‌ట్టాల్సి ఉంది. జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో వ‌చ్చే రెండేళ్ల‌లో వీటిని నిర్మించేందుకు ప్ర‌భుత్వం స‌మాయ‌త్తం అవుతోంది. అయితే.. కేవ‌లం పేద‌ల‌కే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుండ‌డంపై మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గం ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. తాము కూడా ఇళ్ల కోసం వేచి చూస్తున్నామ‌ని.. ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారం కావాల‌ని కొన్నాళ్లుగా వారు కూడా కోరుతున్నారు.

ఈ క్ర‌మంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి క‌కోసం.. జ‌గ‌న్ స‌ర్కారు.. జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్ షిప్ ప‌థ‌కాన్ని ప‌ట్టాలు ఎక్కించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. దీనిలో 150 నుంచి 200 గ‌జాల స్థ‌లాల‌ను మ‌ధ్య‌త‌ర‌గ‌తికి కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిపాద‌నల‌కే ప‌రిమిత‌మైన ఈ ప‌థ‌కాన్ని సంక్రాంతి క‌కానుక‌గా ప‌ట్టాలు ఎక్కించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గానికి కొంత రుసుముతో వీటిని ఇవ్వ‌నున్నారు. జ‌గనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చౌక ధరలకు ఇళ్ల స్ధలాలను మధ్య తరగతికి ప్రభుత్వమే విక్రయించబోతోంది.

ఈ ప్రాజెక్టు తొలిదశను సీఎం జగన్ సంక్రాంతి రోజు అమరావతిలో ప్రారంభించబోతున్నారు. తొలిదశలో ఐదు జిల్లాల్లో ప్రాజెక్టు అమలు చేస్తారు. ఆ తర్వాత మిగతా జిల్లాలకు విస్తరిస్తారు. ఐదు జిల్లాల్లో భూముల సేకరణ ఇప్ప‌టికే పూర్తయింది. తొలిదశలో మంగళగిరిలోని అమరావతి టౌన్ షిప్ తో పాటు రాష్ట్రంలో మరో నాలుగు పట్టణాభివృద్ధి సంస్ధల పరిధిలో ఈ లే అవుట్లను ప్రారంభించబోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలు ఇళ్ల స్ధలం కొనుక్కోవాలంటే మార్కెట్ ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్దితి ఉంది. దీంతో త‌మ క‌ల సాకారం చేసుకునేందుకు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం.. అప్పో సొప్పో చేసి ఇల్లు కొనుగోలు చేస్తున్నారు.

అయితే.. వీటి ధ‌ర‌లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ఇంటి స్ధలం కొనుగోలు చేయాలన్నా భారీ మొత్తాల్ని వెచ్చించాల్సిన పరిస్ధితులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పేరుతో స్ధలాల‌ను.. మార్కెట్ ధర కంటే చౌక ధరలోనే మధ్యతరగతి ప్రజలకు అందించనుంది. దీంతో మధ్యతరగతి ప్ర‌జ‌లు వీటిలో ఇళ్లు కట్టుకునేందుకు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు తీసుకునేందుకు సైతం ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌నుంది.

తొలిదశలో భాగంగా ప్రస్తుతం ఐదు జిల్లాల్లో ప్రభుత్వం ఈ టౌన్ షిప్ లను అభివృద్ధి చేయనుంది. ఇందులో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అమరావతి టౌన్ షిప్ తో పాటు అనంతపురంలోని అహుడా పరిధిలో అనంత‌పురం జిల్లా ధర్మవరం యూఎల్ బీలో కుంతూరు రూరల్, నెల్లూరు జిల్లా నుడా పరిధిలోని జలదంకి యూఎల్బీలో జమ్మలపాలెం, కడప జిల్లాలో ఆడా పరిధిలో రాయచోటి యూఎల్బీలోని దిగువ అంబవరం, ప్రకాశం జిల్లా అనుడా పరిధిలోని కుందుకూరులో ఎంఐజీ లే అవుట్లను ప్రభుత్వం ప్రారంభించబోతోంది.

ప్రతీ లే అవుట్ లోనూ 40 నుంచి 60 అడుగుల బీటీ రోడ్లు అభివృద్ధి చేస్తారు. ఈ లే అవుట్లలో నిరంతరం నీటి సరఫరాతో పాటు వీధి దీపాలు కూడా అమరుస్తారు. ఫుట్ పాత్ లను కూడా నిర్మిస్తారు. పూర్తిగా అండర్ గ్రౌండ్ విధానం అమలు చేస్తారు. డ్రైనేజీలతో పాటు ఆటస్ధలాలు, ప్రజావసరాల కోసం బహిరంగ స్ధలాలకు కేటాయింపులు ఉంటాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు ఇళ్లను నిర్మించేందుకు ముందుకొస్తారని అధికారులు భావిస్తున్నారు. వీటి అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవడంతో కొనుగోలుదారుల నుంచి ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

స్మార్ట్ టౌన్ షిప్ లో ప్లాట్ కావాలంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్, కంట్రీ ప్లానింగ్ వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ పోర్టల్ లో లే అవుట్లు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన ప్లాట్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. 150, 150, 140 చదరపు గజాల్లో లే అవుట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఆన్ లైన్ బుకింగ్ సమయంలో ప్లాట్ విలువలో 10 శాతం చెల్లించాలి. ప్లాట్ కేటాయించడానికి నెల రోజుల ముందు సదరు పట్టణాభివృద్ధి సంస్ధకూ, లబ్దిదారుడికీ మధ్య ఒప్పందం జరుగుతుంది. నెల తర్వాత ప్లాట్ వ్యయంలో 30 శాతం చెల్లించాలి. ఆరు నెలల తర్వాత మరో 30 శాతం చెల్లించాలి. 12 నెలల తర్వాత మిగిలిన 30 శాతం డబ్బుల్ని చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్ల ధరలు, ఇతర వివరాలు వెబ్ సైట్లోనే అందుబాటులో ఉంచనున్నారు.