Begin typing your search above and press return to search.

బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ.. మోడీకి కోపం వస్తుందా?

By:  Tupaki Desk   |   4 Jun 2021 4:40 AM GMT
బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ.. మోడీకి కోపం వస్తుందా?
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక అంశం తాజాగా వెలుగు చూసింది. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సినేషన్ కు కిందా మీదా పడుతున్న పరిస్థితి. కేంద్రం నుంచి ఆశించినంతగా టీకాలు రాకపోవటం.. పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటంతో అన్ని రాష్ట్రాలు కిందా మీదా పడుతున్నాయి. ఇలాంటివేళ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. దేశంలోని బీజేపీయేతర పాలనలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇంతకీ బీజేపీయేతర సీఎంలకు జగన్ రాసిన లేఖలో ఏముంది? ఆయన ఏ అంశాల్ని ప్రస్తావించారు? అన్న విషయంలోకి వెళితే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు లేఖ రాశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇదే తరహా లేఖను బీజేపీ ఏలుబడిలో లేని రాష్ట్రాల సీఎంలకు రాసినట్లుగా చెబుతున్నారు. టీకా కార్యక్రమంలో తనకు ఎదురైన అనుభవాలు.. తన ప్రయత్నాల్ని చెప్పటంతో పాటు.. ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆయన ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ వేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆ విషయాన్ని ప్రకటించారు కూడా. అందరికి ఉచిత టీకా హామీని ఇచ్చారు. ఈ క్రమంలో టీకాల కోసం గ్లోబల్ టెండర్లను పిలిచారు. జూన్ 3 నాటికి గడువు ముగిసినప్పటికి ఒక్క కంపెనీ కూడా వ్యాక్సిన్ సరఫరాకు ముందుకు రాకపోవటం తనను ఆందోళనకు గురి చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితి రాష్ట్రాలు వర్సెస్ కేంద్రంగా మారటం.. అంతిమంగా బిడ్ లను కేంద్రమే ఆమోదించాల్సి ఉంటుందన్న విషయాన్ని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ‘‘వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలుగా మన చేతుల్లో ఏమీ లేదు. కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయి. తగినంత టీకాలు రావటం లేదు. వ్యాక్సిన్ విషయంలో ఆలస్యం జరిగితే మనం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్రానికి వదిలేద్దాం’’ అని లేఖలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.

ఈ ఏడాది మొదట్లో చేసినట్లే.. వ్యాక్సిన్ బాధ్యతను కేంద్రాన్నే తీసుకోవాలని కోరదామన్న ఆలోచనను తెర మీదకు తెచ్చారు. టీకాల కోసం నెలన్నర పాటు ప్రయత్నించామని.. ఈ క్రమంలో తమకు చాలా సవాళ్లు అనుభవంలోకి వచ్చాయన్నారు. వ్యాక్సిన్ లభ్యతను పెంచటమే ముఖ్యమని.. అదెలా అన్నది వదిలేసి.. కేంద్రానికి బాధ్యత అప్పజెబుదామని కోరటం గమనార్హం. ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసే కన్నా.. అందరం కలిసి కేంద్రానికి బాధ్యత ఇవ్వాలన్న మాటకు ప్రధాని మోడీ కోపానికి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. వ్యాక్సిన్ కొనుగోలు విషయంలో ఉన్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రులు గుర్తించటంలో జగన్ లేఖ సాయంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. బీజేపీ యేతర ముఖ్యమంత్రులకు జగన్ రాసిన లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.