Begin typing your search above and press return to search.

ఏపీలో లాక్ డౌన్ , కర్ఫ్యూ లపై కీలక ప్రకటన చేసిన సీఎం జగన్

By:  Tupaki Desk   |   8 April 2021 11:50 AM GMT
ఏపీలో లాక్ డౌన్ , కర్ఫ్యూ లపై కీలక ప్రకటన చేసిన సీఎం జగన్
X
ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా పట్ల పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం జగన్ ఆదేశించారు. మళ్ళీ లాక్‌డౌన్ పరిస్థితులు వస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని.. గత ఏడాది కరోనా వల్ల రాష్ట్రానికిరూ.21 వేల కోట్లు ఆర్థికంగా నష్టం వచ్చిందని తెలిపారు. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో రెమిడెసివీర్ కొరత రాకుండా అవసరమైన డోసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 1.4 లక్షల మందికి కరోనా వాక్సినేషన్ వేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రస్తుతానికి 3 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఇవి రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని సీఎంకు తెలిపారు. మన అవసరాలకు తగినన్ని డోసుల వాక్సిన్ సరఫరా కావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో 45 ఏళ్ళకు పైబడి ఇంకా వాక్సినేషన్ చేయించుకోవాల్సిన వారు సుమారు కోటి మంది వరకు వుంటారని అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి వాక్సినేషన్ అందించాలన్న లక్ష్యంతో పనిచేయాలని సీఎం అదేశించారు. వాక్సినేషన్‌ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వలంటీర్లు, ఆశావర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సీఎం జగన్ చెప్పారు. అప్పుడే అనుకున్న విధంగా వాక్సినేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తవుతుందన్న అభిప్రాయపడ్డారు. వాక్సినేషన్ కోసం అవసరమైన డోస్‌లను సిద్దం చేసుకోవడం ద్వారా వాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలన్నారు.

కోవిడ్ చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ జరగడానికి వీల్లేదని.., ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే చికిత్స జరగాలని జగన్ స్పష్టం చేశారు. అలా కాకుండా అధిక ధరలపై ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆసుపత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని చెప్పారు. మాస్క్‌ పెట్టుకోని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి సూచించారు.

కోవిడ్ వచ్చిన వారు ఆసుపత్రుల్లో బెడ్ కోసం 104 కి ఫోన్ చేసి అడిగితే గతంలో ఎలా సమకూర్చామో, ఇప్పుడు కూడా అలాగే చేయాలని జగన్ ఆదేశించారు. కోవిడ్ పేషంట్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగా చికిత్స అందించాలన్నారు.లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేసే ఆలోచన లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించటం‌, వ్యాక్సినేషన్ కు ముందుకు రావడం చేయాలి మంత్రి ఆళ్లనాని తెలిపారు.