Begin typing your search above and press return to search.

జగన్ తో పెద్ద మాట : ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్ళు...?

By:  Tupaki Desk   |   2 Aug 2022 10:33 AM GMT
జగన్ తో పెద్ద మాట : ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్ళు...?
X
పార్టీ జెండా మోసిన వారు ఎపుడూ పూచిక పుల్లలే. పక్కన పడవేసిన కరివేపాకులే. వారి అవసరం అయిదేళ్ళకు ఒకమారు వస్తుంది. ఆ టైమ్ లో మంచిగా ఉంటే సరిపోతుంది. మిగిలిన కాలమంతా తమకు నచ్చినట్లుగా అధికారం చలాయిస్తే చాలు అనుకునేవారు చాలా మంది ఉంటారు. ఇదే ఇపుడు వైసీపీలో లీడర్ కి క్యాడర్ కి మధ్య దూరాన్ని పెంచుతోంది. ఫలితంగా ఒకనాటి కసి అన్నది కార్యకర్తలలో పూర్తిగా తగ్గిపోతోంది.

వారు మాకెందుకీ పార్టీ అంటూ చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. వారిని ఇప్పట్లో పట్టించుకుంటారని కానీ వారి గోడు వింటారని కానీ ఎవరూ అనుకోలేదు. ఇంకా ఎన్నికలకు చాలా దూరం ఉంది కాబట్టి అంతా అలాగే భావించారు. అయితే జగన్ మాత్రం క్యాడర్ తో భేటీలు అని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఇపుడు క్యాడర్ రోజు వచ్చింది.

అదే టైమ్ లో తమకు అవకాశం ఉంటే నేరుగా అధినేత ముందుకే వచ్చి అన్ని విషయాలు చెప్పాలని ముఖ్య కార్యకర్తలు అంతా భావిస్తున్నారుట. ఈ నెల 4 నుంచి ప్రతీ నియోజకవర్గానికి యాభై మంది వంతున క్యాడర్ ని పిలిచి వారితో మాటామంతీ చేసే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుడుతున్నారు.

మరి ఫస్ట్ ఏ నియోజకవర్గానికి చాన్స్ ఉంటుందో తెలియదు. అదే విధంగా ముఖ్య కార్యకర్తలు అంటే పార్టీకి దూరంగా ఉంటూ ఆ పార్టీ మేలు కోరేవారు హాజరవుతారా లేక ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉండే వారే కార్యకర్తలుగా మారి జగన్ ముందు హాజరీ వేయించుకుంటారా అన్న చర్చ అయితే వస్తోంది.

జగన్ అనుకున్నది నెరవేరాలీ అన్నా, పార్టీ బాగుపడాలీ అన్నా కూడా కచ్చితంగా ముఖ్యమైన కార్యకర్తలు హాజారు కావాల్సి ఉంటుంది అపుడే అసలు విషయం తెలుస్తుంది. నిజానికి అత్యధిక నియోజకవర్గాలలో ముఖ్య కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు బాగా గ్యాప్ ఉంది అంటున్నారు. అలాగే ఎమ్మెల్యేల పోకడలను క్యాడరే చాలా చోట్ల వ్యతిరేకిస్తోంది అని కూడా అంటున్నారు.

ఈ క్రమంలో ముఖ్య కార్యకర్తలను ఎవరు ఎంపిక చేస్తారు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. అధినాయకత్వం ప్రాంతీయ కో ఆర్డినేటర్లను వేసింది. అలాగే బాధ్యులుగా కొందరు పెద్దలను పెట్టింది వారి ద్వారా స్క్రూటిని చేసి అసలైన కార్యకర్తలను కనుక జగన్ వద్దకు పంపిస్తే వైసీపీలో అతి పెద్ద అలజడి పుట్టడం ఖాయమని అంటున్నారు. ఎందుచేతనంటే పార్టీకి మూల విరాట్టు లాంటి క్యాడర్ చెప్పే నగ్న సత్యాలకు చాలా మంది నాయకుల కూశాలు కదిలిపోతాయని అంటున్నారు.

అధికార పార్టీలో వర్గ పోరు ఒక స్థాయిలో ఉంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పడడం లేదు. అదే విధంగా వారికి యాంటీగా వీరు వీరికి యాంటీగా వారు గట్టిగా పనిచేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల మీద పై చేయి సాధించేందుకు ఎంపీలకు ఒక చాన్స్ వచ్చింది అంటున్నారు. దాంతో వారు ఎమ్మెల్యేల పనితీరు గిట్టని పదునైన కార్యకర్తలనే పార్టీ పెద్దలకు సూచించి ఎంపిక చేస్తారని అంటున్నారు.

అదే కనుక జరిగితే వైసీపీ ఎమ్మెల్యేల అసలైన వ్యవహార శైలి ఏంటి అన్నది కచ్చితంగా జగన్ కి చాలా బాగా తెలుస్తుంది అంటున్నారు. దాంతో ఇప్పటికే తమ పనితీరు మీద వరస సర్వేలు చేయిస్తున్న అధినాయకత్వం ఇపుడు ఏకంగా పార్టీలోనే రియల్ పిక్చర్ చూస్తే ఏ రకమైన రియాక్షన్ ఇస్తుందో అన్న బెంగ అయితే చాలా మంది ఎమ్మెల్యేలలో ఉందని అంటున్నారు.